Amaravati, Feb 6: ప్రయాణీకుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) బంపరాఫర్ (APSRTC Offer) ప్రవేశపెట్టింది. ఆర్టీసీలో డాల్పిన్, అమరావతి, ఇంద్ర, సూపర్‌లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సులో ప్రయాణించడానికి 48 గంటల ముందుఎవరైనా టిక్కెట్లను రిజర్వు చేసుకుంటే (Ticket Booking) ఛార్జీలో 10 శాతం రాయితీ కల్పించనున్నారు. ఈ విషయాన్ని ఆర్టీసీ సంస్థ రీజినల్ మేనేజర్ జితేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.
శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ఈ రాయితీ సౌకర్యం విశాఖపట్టణం, విజయవాడ, హైదరాబాదు, చెన్నై, బెంగళూరు నగరాలకు వెళ్లే ప్రయాణీకులకు మాత్రమే వర్తిస్తుందన్నారు. రాయితీ పొందేందుకు 48 గంటల ముందు (Advance Ticket Booking In 48 hours) రిజర్వు చేసుకోవాలని తెలిపారు. అయితే తొలి నాలుగైదు సీట్లకు మాత్రమే రాయితీ ఉంటుందని తెలిపారు.
డాల్ఫిన్ బస్సులో 58 సీట్ల కెపాసిటీ ఉంటే ఐదుగురికి, అమరావతి బస్సులో 49 సీట్ల కెపాసిటీ ఉంటే ఐదుగురికి, ఇంద్ర బస్సులో 40 సీట్లు ఉంటే నలుగురు, సూపర్ లగ్జరీలో 35 సీట్లకుగాను నలుగురికి, అల్ట్రా డీలక్స్‌లో 39 సీట్లకుగాను నలుగురు, ఎక్స్‌ప్రెస్ బస్సులో 49 సీట్లు ఉంటే ఐదుగురికి రాయితీ అవకాశం ఉంటుందన్నారు. ఈ అవకాశం మార్చి 31వ తేది వరకు అమలులో ఉంటుందని ఆయన వివరించారు.
తిరుమల వెళ్లి దైవదర్శనం చేసుకునే భక్తులకు శీఘ్రదర్శనం టికెట్లను ఏపీఎస్‌ఆర్టీసీ అందుబాటులో ఉంచింది. గతేడాది కోవిడ్‌కు ముందు ఉన్న ఈ సౌకర్యాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. ఫిబ్రవరి నుంచి తిరుపతికి వెళ్లే దూర ప్రాంత సర్వీసుల్లో శీఘ్రదర్శన టికెట్లు అందుబాటులోకి తీసుకువచ్చారు. నిత్యం వెయ్యి శీఘ్రదర్శన టికెట్లను అందుబాటులో ఉంచేలా టీటీడీ అవకాశం కల్పించింది. ఆర్టీసీ బస్సుల్లో తిరుపతి వెళ్లే ప్రయాణికులు చార్జీలతో పాటు రూ.300 అదనంగా చెల్లించి బస్సులోనే శీఘ్రదర్శనం టికెట్లు పొందవచ్చు.
రోజూ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు టికెట్లు పొందే ప్రయాణికులకు శీఘ్రదర్శనం కల్పిస్తారు. తిరుమల బస్ స్టేషన్ చేరుకున్న తర్వాత శీఘ్రదర్శనం టికెట్లు పొందిన వారికి ఆర్టీసీ సూపర్‌వైజర్లు సహాయం చేస్తారు. అడ్వాన్స్‌డ్ రిజర్వేషన్ టికెట్లు పొందే వారికి ఈ సౌకర్యం వర్తిస్తుంది. ఏపీఎస్‌ఆర్టీసీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి రోజూ 650 బస్సుల్ని తిరుపతికి నడుపుతోంది. ప్రతి డిపో నుంచి తిరుపతికి బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు.
బెంగళూరు, చెన్నై, కంచి, నెల్లూరు, పాండిచ్చేరి, హైదరాబాద్ నుంచి వచ్చే ప్రయాణికులు అడ్వాన్స్‌డ్ రిజర్వేషన్‌తో పాటు శీఘ్రదర్శన టికెట్లు పొందవచ్చు. తొలి రోజు ప్రారంభించిన ఈ శీఘ్రదర్శన టికెట్ల సౌకర్యాన్ని 550 మంది ప్రయాణికులు వినియోగించుకున్నారు. ఈ సౌకర్యాన్ని కల్పించడంపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డిలకు ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.