Amaravati, Sep 2: ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత, తెలంగాణ నుంచి ఏపీకి తిరిగే బస్సుల సంఖ్యతో పోలిస్తే, ఏపీ నుంచి తెలంగాణకు వచ్చే బస్సుల సంఖ్యే అధికంగా ఉండేదన్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా బస్సులు ఆగిపోయిన తరువాత, తిరిగి పునరుద్ధరించాలన్న ఆలోచనలో రెండు రాష్ట్రాలూ ఉన్నప్పటికీ, సమాన కిలోమీటర్ల మేరకు బస్సులను తిప్పేలా అంతర్రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకోవాలని టీఎస్ (TSRTC) భావిస్తోంది.
ఈ మేరకు ఇప్పటికే ప్రతిపాదనలను సిద్ధం చేస్తూ, ఏపీఎస్ ఆర్టీసీ (APSRTC) బస్సులు 1.12 లక్షల కిలోమీటర్లు అధికంగా తిరుగుతున్నాయని, ఆ మేరకు తగ్గించుకోవాలని టీఎస్ ఆర్టీసీ అధికారులు కోరారు. అయితే ఏపీఎస్ఆర్టీసీ మాత్రం 56 వేల కిలోమీటర్లు తగ్గించుకుంటామని ఆ మేరకు మీరు పెంచుకోవాలని కోరింది. ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం, ఆర్టీసీ కార్మికులకు రూ. 50 లక్షల కోవిడ్ బీమా
గతంలో ఏపీ నుంచి తెలంగాణకు ఉన్న బస్సు సర్వీసులన్నీ మళ్లీ నడపాలనుకుంటున్నామని తెలంగాణ నుంచి ఏపీకి మరిన్ని సర్వీసులు పెంచుకోవాలని ఏపీ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తెలంగాణ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశారు. దీనిపై ఇంకా టీఎస్ ఆర్టీసీ అధికారులు స్పందించలేదు. అన్ లాక్ 4లో భాగంగా తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసుల పునరుద్ధరణ, అంతర్రాష్ట్ర ఒప్పందంపై రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల స్థాయిలో చర్చలు నడుస్తున్నాయి. ఈ విషయం త్వరలో ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.