
Hyderabad, OCT 01: టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు (Chinthakayala Ayyannapatrudu ) కుమారుడు చింతకాయల విజయ్‌కు (Chinthakayala vijay) ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని విజయ్ నివాసంలో నోటీసులు అందజేశారు. పోలీసులు వెళ్లిన సమయంలో విజయ్ ఇంట్లో లేకపోవడంతో.. ఇంట్లో పని చేసే సర్వెంట్ ను అదుపులోకి తీసుకున్నారు. పనిమనిషిని ఎందుకు అదుపులోకి తీసుకున్నారన్న దానిపై క్లారిటీ లేదు. ఈ నెల 6న మంగళగిరిలోని సీఐడీ (CID) ఆఫీసులో సైబర్ క్రైమ్ (Cyber crime) విభాగంలో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో (Notice) విజయ్ ను ఆదేశించారు పోలీసులు. అలాగే ప్రస్తుతం వాడుతున్న మొబైల్ ఫోన్లను తన వెంట తేవాలని పోలీసులు చెప్పారు. విచారణకు రాకపోతే అరెస్ట్ చేయాల్సి ఉంటుందని నోటీసుల్లో పేర్కొంది సీఐడీ.
సోషల్ మీడియాలో పోస్టులపై గతంలో విజయ్ పై కేసు నమోదు చేసింది సీఐడీ. ఇదిలా ఉంటే.. విజయ్ ఇంటికి వెళ్లిన పోలీసులు దురుసుగా వ్యవహరించారని టీడీపీ నేత నారా లోకేశ్ (Nara lokesh) ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయ్‌ని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసేందుకు యత్నించారని ఆయన ఆరోపించారు. ఈ తరహా ఘటనలపై హైకోర్టు ఎన్నిసార్లు మందలించినా జగన్ సర్కారుకు బుద్ధి రావట్లేదని మండిపడ్డారు.
విజయ్ ఇంట్లో పనిచేసే వారిపై బెదిరింపులకు దిగారని, పోలీసుల తీరును ఖండించారు లోకేశ్. పోలీస్ వ్యవస్థను రాజకీయ కక్ష సాధింపుల కోసం సీఎం జగన్ వినియోగిస్తున్నారని ధ్వజమెత్తారు నారా లోకేశ్.