Sri Sathya Sai, May 9: శ్రీ సత్యసాయి జిల్లాలో సంచలన కలిగించిన బీఫార్మసీ విద్యార్థి తేజస్విని మృతి కేసులో (B.Pharmacy Student Murder Case) నిందితుడు సాధిక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సాధిక్ ఆలియాస్ బాబూలాల్ వేధింపుల వల్లే తేజశ్విని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందన్న పోలీసులు.. అతనిపై 420, 376, 306 సెక్షన్ల కింద కేసు నమోదు (Police arrests Accused in Sri Sathya Sai district) చేశారు. కేసు విచారణ బాధ్యతలు దిశ పోలీసులకు అప్పగించామని.. రెండు వారాల్లో దర్యాప్తు పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు ధర్మవరం డీఎస్పీ రమాకాంత్ తెలిపారు.
గోరంట్ల మండలం మల్లాపల్లి సమీపంలో ప్రియుడు సాదిక్‌కు సంబంధించిన షెడ్డులో ఈ నెల 4న బీ ఫార్మసీ విద్యార్థిని తేజస్విని ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించిన విషయం తెలిసిందే. ఈ కేసుపై గతంలో డీఎస్పీ రమాకాంత్ మీడియాతో మాట్లాడుతూ.. తేజస్విని, సాదిక్ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారని తెలిపారు. ఈ నెల 4న తేజస్వినికి సాదిక్ ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నాడని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆమెను పొలంలోని రేకుల షెడ్‌కు తీసుకెళ్లాడని.. రెండు గంటల పాటు వీరిద్దరూ మాట్లాడుకున్నారని వివరించారు.
రాత్రి కావడంతో భోజనం తెస్తానని షెడ్‌లోనే సాదిక్ ఆమెను వదిలి వెళ్లాడని డీఎస్పీ పేర్కొన్నారు. అయితే, ఇంటి నుంచి మళ్లీ పొలంలోని షెడ్‌కు సాదిక్ వెళ్లేసరికి యువతి ఉరేసుకుని కనిపించిందని వివరించారు. ఈ విషయాన్ని సాదిక్ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి చెప్పాడని పేర్కొన్నారు. ఈ క్రమంలో మొదటిసారి నిర్వహించిన పోస్టుమార్టంలో యువతి ఉరేసుకున్నట్లు వచ్చిందని డీఎస్పీ రమాకాంత్ చెప్పారు.
అయితే, మృతురాలి తల్లిదండ్రులు మాత్రం సామూహిక అత్యాచారం, హత్యగా అనుమానించారని తెలిపారు. ఈ క్రమంలో దీన్ని అత్యాచార కేసుగా నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేపట్టాలని దిశా డీఎస్పీని ఆదేశించారు. రెండు వారాల్లోపు దర్యాప్తు పూర్తి చేసి, కోర్టులో చార్జిషీట్ దాఖలు చేస్తామన్నారు. సోమవారం దిశా డీఎస్పీ గోరంట్లకు చేరుకుని, మల్లాపల్లి సమీపాన నిందితుడు సాదిక్‌కు చెందిన పొలంలోని షెడ్డు వద్ద వివరాలు సేకరించినట్లు సమాచారం. కాగా, ఈ కేసులో ఇప్పటికే నిందితుడు సాదిక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.