Guntur, April 29: గుంటూరులో గత ఏడాది ఆగస్టు 15న జరిగిన బీటెక్ విద్యార్థిని నల్లపు రమ్య (20) హత్య కేసులో (Ramya Murder Case) ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు వెలువడింది. నిందితుడు శశికృష్ణకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు (death sentense) చెప్పింది. సుదీర్ఘ వాదనల తర్వాత కోర్టు ఉరిశిక్ష విధించింది. 28 మంది సాక్షుల నుంచి వాంగూల్మం సేకరించింది. 9 నెలల్లోనే విచారణ పూర్తిచేసి కోర్టు.. తీర్పునిచ్చింది. నేర నిర్థారణలో సీసీ ఫుటేజీ కీలకంగా మారిందని, సెక్షన్ 302 కింద ఉరిశిక్షను కోర్టు ఖరారు చేసిందని ప్రభుత్వం న్యాయవాది తెలిపారు. ప్రత్యక్ష సాక్షులతో పాటు డిజిటల్ ఎవిడెన్స్ కీలకంగా మారాయని ఎస్పీ తెలిపారు. పోలీసులు ప్రత్యేక శ్రద్ధతో కేసును పరిష్కరించారన్నారు.
కేసు వివరాల్లోకెళితే.. తనను ప్రేమించడంలేదని వట్టిచెరుకూరు మండలం ముట్లూరుకు చెందిన కుంచాల శశికృష్ణ (19) ఉదయం 9.40కి టిఫిన్ తీసుకురావడం కోసం ఇంటి నుంచి బయటకు వచ్చిన రమ్యతో గొడవపడి కత్తితో ఎనిమిదిసార్లు (B Tech Student Ramya Murder Case) పొడిచాడు. ప్రభుత్వాస్పత్రికి తరలించేలోగా రమ్య చనిపోయింది. ఈ హత్యను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. నిందితుడు శశికృష్ణను అదేరోజు రాత్రి నరసరావుపేట సమీపంలోని మొలకలూరులో అరెస్టు చేసిన పోలీసులు ఆరురోజుల్లో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. గుంటూరు ప్రత్యేక న్యాయస్థానంలో గత ఏడాది డిసెంబర్ ఏడు నుంచి సాక్షుల వాంగ్మూలం నమోదు చేశారు. ఈ నెల రెండున మొదలైన వాదనలు మంగళవారం ముగిశాయి. గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం తీర్పు వెల్లడించింది.