Badvel, Nov 2: ఆంధ్రప్రదేశ్ లోని బద్వేలు ఉప ఎన్నిక కౌంటింగ్ (Badvel Bypoll Result 2021) కొనసాగుతోంది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ భారీ ఆధిక్యంలో (YSRCP lead in all rounds till now) కొనసాగుతున్నారు. భారీ విజయం దిశగా వైఎస్సార్‌సీపీ దూసుకుపోతోంది. బద్వేల్‌లో ఐదో రౌండ్ ముగిసే సరికి 42,824 ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్‌సీపీ కొనసాగుతోంది. నాలుగో రౌండ్ ముగిసేసరికి 30,412 ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఉన్నారు. అంతకుముందు మూడో రౌండ్ ముగిసేసరికి ఆమె 23,754 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. తొలి రౌండ్‌లో 9వేల ఓట్ల ఆధిక్యంలో వైసీపీ కొనసాగింది.
బద్వేల్‌లో తొలి రౌండ్ లో 8,790 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి దాసరి సుధ ముందంజలోకి వచ్చారు. ఈ రౌండ్ లో వైసీపీకి 10,478, బీజేపీకి 1,688, కాంగ్రెస్‌కు 580, నోటాకు 342 ఓట్లు లభించాయి. ఇక పోస్టల్ బ్యాలెట్‌లోనూ వైఎస్సార్‌సీపీ ఆధిక్యం కనబర్చింది. కాగా, కరోనా మార్గదర్శకాలకు అనుగుణంగా కౌంటింగ్ కొనసాగుతోంది. గరిష్ఠంగా మొత్తం 12 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకే తుది ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది.
కాగా, ఈ ఎన్నికలో పోటీ చేయకుండా టీడీపీ, జనసేన దూరంగా ఉన్న విషయం తెలిసిందే. కాగా, దేశ వ్యాప్తంగా మూడు లోక్‌సభ, 27 శాసనసభ స్థానాలకు అక్టోబరు 30న ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియే నేడు కొనసాగుతోంది.