Hyd, Nov 2: తెలంగాణలోని హుజూరాబాద్, ఆంధ్రప్రదేశ్ లోని బద్వేల్ నియోజకవర్గాల ఉప ఎన్నికల కౌంటింగ్ (Bypoll Results 2021) ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలట్ ఓట్లను (Badvel and Huzurabad by-election results) లెక్కించారు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. హుజారాబాద్ ఓట్లను కరీంనగర్ లోని ఎస్ఆర్ఎర్ కళాశాలలో, బద్వేల్ ఓట్లను పట్టణంలోని బాలయోగి గురుకుల పాఠశాలలో లెక్కిస్తున్నారు.
బద్వేల్ తొలి రౌండ్‌లో 9వేల ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్‌సీపీ నిలిచింది. తొలి రౌండ్‌లో వైఎస్సార్‌సీపీ 10,478, బీజేపీ 1688, కాంగ్రెస్‌కు 580 ఓట్లు లభించాయి. ఇక హుజూరాబాద్ పోస్టల్ బ్యాలెట్‌లో టీఆర్‌ఎస్‌కు 503, బీజేపీ 159, కాంగ్రెస్ 32, చెల్లనవి 14గా ఉన్నాయి. మొత్తంగా పోస్టల్‌బ్యాలెట్‌లలో టీఆర్‌ఎస్ ఆధిక్యం సాధించింది. తొలిరౌండ్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 166 ఓట్ల ఆధిక్యం సాధించారు. బీజేపీ 4610, టీఆర్‌ఎస్ 4444, కాంగ్రెస్ 114 ఓట్లు సాధించాయి.
బద్వేలులో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్, వర్షంతో ఇబ్బంది పడ్డ ఓటర్లు, 59 శాతం పోలింగ్ నమోదు..
హుజూరాబాద్ ఉప ఎన్నికలో 30 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్, బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పోటీలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. విజయోత్సవ ర్యాలీలకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో శనివారం జరిగిన పోలింగ్‌లో ఓటర్లు భారీగా తరలివచ్చి ఓట్లేశారు. దాంతో రికార్డు స్థాయిలో 86.64 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం ఓట్లు 2,36,873 కాగా, ఓటు హక్కు వినియోగించుకున్న వారి సంఖ్య 2,05,236. కాగా 1,02,523(87.05 శాతం) మంది పురుషులు, 1,02,712(86.25 శాతం) మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 22 రౌండ్లలో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ముగియనుంది. ఒక్కో రౌండ్‌కు 30 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది.
ప్రశాంతంగా ముగిసిన హుజూరాబాద్ ఉపఎన్నిక, కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తత, 76 శాతం దాటిన పోలింగ్...
బద్వేల్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మధ్యాహ్నానికే పూర్తయ్యే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం 10 నుంచి 12 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి చేయనున్నారు. ఫలితం మధ్యాహ్నం ఒంటిగంటలోపే వచ్చే వీలుందని సమాచారం.
దేశవ్యాప్తంగా మరో 27 శాసనసభ, మూడు లోక్‌సభ స్థానాలకూ ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందులో దాద్రానగర్ హవేలీ, మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా, హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. అక్టోబర్ 30న ఈ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించడం తెలిసిందే.