Vijayawada, May 18: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ..అధికార ప్రతిపక్షాలు పోటాపోటీగా ప్రజా యాత్రలు (Tours) నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ (TDP), జనసేన (BJP), బీజేపీలు (BJP) యాత్రలు చేస్తుండగా..అధికార వైసీపీ (YCP) కూడా ప్రజా యాత్రలకు శ్రీకారం చుట్టింది. మూడేళ్ళుగా చేపట్టిన సంక్షేమాన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లి ఎన్నికల్లో సత్తా చాటాలని వైసీపీ భావిస్తుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అధికార పార్టీ మంత్రులు బస్సు యాత్రకు (Ministers Bus Tour) సిద్ధమయ్యారు. ఈమేరకు వైసీపీ అధిష్టానం పూర్తి కార్యాచరణ సిద్ధం చేసింది. మే 26 నుంచి 29 వరకు మూడు రోజుల పాటు విశాఖపట్నం టూ అనంతపురం బస్సు యాత్ర చేయాలని వైసీపీ అధిష్టానం నిర్ణయించింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మంత్రులతో బస్సుయాత్ర నిర్వహించాలని, ఆయా వర్గాల ప్రజలకు ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించాలని పార్టీ ఆదేశించింది.
ఈ బస్సు యాత్ర కోసం ఇప్పటికే రెండు ప్రత్యేక బస్సులు (Special Buses) సిద్ధం కాగా 17 మంది మంత్రులు యాత్రలో పాల్గొననున్నారు. విశాఖపట్నం నుంచి ప్రారంభమయ్యే బస్సు యాత్ర అనంతపురంలో ముగుస్తుంది. రాష్ట్రంలోని ముఖ్యమైన పట్టణాలు నియోజకవర్గాలు మండల కేంద్రాల మీదుగా బస్సు యాత్ర కొనసాగనుంది. శ్రీకాకుళం, రాజమండ్రి, నరసరావుపేట, అనంతపురంలో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఆయా ప్రాంతాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో మంత్రులతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు, నేతలు, పార్టీ కార్యకర్తలు పాల్గొనాలని అధిష్టానం ఆదేశించింది.
స్థానిక సంస్థలు నామినేటెడ్ పదవులు రాజ్యసభ స్థానాల్లో వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను ప్రజల దృష్టికి తీసుకెళ్లనున్నారు మంత్రులు. ప్రస్తుతం అసెంబ్లీ నియోజకవర్గాల్లో గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది వైసీపీ.