Polavaram Project(Photo-wikimedia commons)

Amaravati, Dec 27: ఏపీ ప్రభుత్వం వీలయినంత త్వరగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం శుభవార్తను అందించింది. పోలవరం అంచనా వ్యయంపై కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరదించుతూ కేంద్రం సానుకూల ప్రకటన చేసింది. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదించిన వ్యయం 55,548.87కోట్ల రూపాయలని జలశక్తి శాఖ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సంవత్సర సమీక్షలో శనివారం వెల్లడించింది.

గతంలో టీడీపీ ప్రభుత్వంతో ఒప్పందంలో భాగంగా 2014 ధరల ప్రకారం చెల్లింపులు చేస్తామని కేంద్ర ప్రభుత్వం గత కొంత కాలం నుంచి చెబుతూ వస్తున్న సంగతి విదితమే.. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 2014 అంచనా వ్యయం ఇప్పుడు సరికాదంటూ.. కేంద్ర ప్రభుత్వం లేవనెత్తిన సందేహాలకు సమాధానాలు ఇచ్చి ప్రాజెక్టు వ్యయంపై పూర్తి నివేదికను సమర్పించింది.

సవరించిన అంచనాలను ఆమోదించాలని ఇటీవల హోంమంత్రి అమిత్‌ షా, జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ను కలిసి సీఎం జగన్‌ కోరారు కూడా.. సవరించిన వ్యయ అంచనాలు –2 (ఆర్‌సీఈ) 2017–18 ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు కోసం అయ్యే రూ.55,656 కోట్ల వ్యయాన్ని ఆమోదించాలని.. పోలవరం ప్రాజెక్టును వీలైనంత త్వరగా ప్రజలకు అందచేసేలా కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

పోలవరం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో ఇంకా రూ.1,779 కోట్ల మేర రీయింబర్స్‌ చేయాల్సి ఉందని, 2018 డిసెంబర్‌కు సంబంధించిన ఈ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. ఇదే విషయంపై రాష్ట్ర అర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ సైతం పలుమార్లు ఢిల్లీ పర్యటనలో కేంద్రమంత్రులకు వినతిపత్రాలను సమర్పించారు.

ఏపీలో కొత్త కరోనావైరస్ స్ట్రెయిన్ లక్షణాలు లేవు, ప్రయాణికులకు విమానాశ్రయాల్లోనే ఆర్‌టీపీఆర్‌ పరీక్షలు, మీడియాతో ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, ఏపీలో తాజాగా 355 మందికి కోవిడ్ పాజిటివ్

రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం.. తాజా అధికారిక ప్రకటనలో 2017-18 ధరల ప్రకారం కేంద్రం ఆమోదించిన వ్యయం 55,548.87కోట్ల రూపాయలని వెల్లడించింది. ప్రాజెక్టుకు ఇప్పటివరకు 8614.16 కోట్ల రూపాయలు విడుదల చేయగా.. త్వరలోనే మరో 2234 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని ప్రకటించింది. ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు కోసం 17,325 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొంది.

Here's Center Report

https://pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=1683785

ఇదిలా ఉంటే పోలవరం పనులన్నీ నిశితంగా పరిశీలించిన ఏపీ సీఎం.. 2021 చివరి నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం సవరించిన అంచనాలను ఆమోదించడంతో పోలవరం నిర్మాణం మరింత వేగవంతం కానుంది.