Vjy, Dec 12: ఏపీ ఫైబర్ నెట్ కేసు విచారణను సుప్రీంకోర్టు (Supreme Court) జనవరి 17కు వాయిదా వేసింది. ఫైబర్‌నెట్ కేసులో (Fiber Net Case) ముందస్తు బెయిల్ కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. స్కిల్ కేసులో 17 ఏపై తీర్పు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో విచారణ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది.
ఈరోజు సుప్రీంలో జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేది ధర్మాసనం ముందు ఫైబర్ నెట్ కేసు విచారణకు వచ్చింది. స్కిల్ కేసులో (Skill Development Case) 17 ఏపై తీర్పు వెలువరించాల్సి ఉన్నందున పైబర్ నెట్ కేసును జనవరి 17కి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది.అంతవరకూ చంద్రబాబుపై ఎటువంటి తదుపరి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.
ఇక కేసుకు సంబంధించి ఎలాంటి బహిరంగ ప్రకటనలు చేయొద్దని ఆదేశించిన న్యాయస్థానం.. చంద్రబాబు గనుక అలాంటి ప్రకటనలు చేసి ఉంటే ఆ రికార్డులు తమకు సమర్పించాలని కోరింది. స్కిల్ స్కాం కేసులో 17ఏ క్వాష్ పిటిషన్‌పై తీర్పు వెలువడిన అనంతరమే ఈ పిటిషన్‌పై విచారణ జరుపుతామని స్పష్టం చేస్తూ విచారణను వచ్చే నెల 17వ తేదీకి వాయిదా వేసింది.
కేసుకు సంబంధించిన విషయాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబును ధర్మాసనం ఆదేశించింది. ఇరుపక్షాలూ సంయమనం పాటించాలని సుప్రీంకోర్టు సూచించింది. కేసు విషయాలపై చంద్రబాబు బహిరంగంగా మాట్లాడుతున్నారంటూ ప్రభుత్వం తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. జైలుకు పంపిన విషయాలపైనా ఆయన మాట్లాడుతున్నారని చెప్పారు. ఈ కేసుపై చంద్రబాబు బహిరంగంగా మాట్లాడకుండా ఆంక్షలు విధించాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు.
అనంతరం చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. చంద్రబాబు కోర్టు నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడలేదని సుప్రీంకోర్టుకు తెలిపారు. ప్రభుత్వం తరఫునే దిల్లీ సహా పలు ప్రదేశాల్లో అదనపు ఏజీ, సీఐడీ డీజీ మీడియా సమావేశాలు నిర్వహించారన్నారు. వారు ప్రెస్‌మీట్ నిర్వహించడం పూర్తిగా తప్పు అని చెప్పారు. మీడియా సమావేశాల్లో నిరాధార ఆరోపణలు చేశారని.. వాటితో పోలిస్తే చంద్రబాబు ఎక్కడా ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదని సిద్ధార్థ లూథ్రా కోర్టుకు తెలిపారు.
ఫైబర్‌నెట్ కుంభకోణానికి పాల్పడ్డారన్న అభియోగాలపై చంద్రబాబుపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఏపీ హైకోర్టులో ఆయన ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేయగా.. కోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారణ జరుపుతోంది.