Amaravati, August 4: మూడు రాజధానుల అంశంపై (Three Capitals Issue) ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి 48 గంటల గడువు ఇస్తున్నానని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పేర్కొన్నారు. ఎన్నికల ముందు చెప్పలేదు కాబట్టి ప్రభుత్వం రాజీనామా చేయాలని, అందరం కలసి ఎన్నికలకు వెళ్లి ప్రజాతీర్పు కోరదామని ఆయన అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి మీడియాతో ఆన్‌లైన్‌లో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ఎన్నికల ముందు చెప్పకుండా ఇప్పుడు రాజధానిని (AP Capital) ఎలా మారుస్తారని ప్రశ్నించారు. మూడు రాజధానులకు సై, రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుకు ఆమోదం తెలిపిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును నాశనం చేసే అధికారం ఎవరికీ లేదు. రాజధాని సమస్య ఏ ఒక్కరిదో కాదు. ఐదు కోట్ల ప్రజలదని చంద్రబాబు అన్నారు. ఎన్నికల ముందు రాజధానిపై చెప్పకుండా ప్రజలను మభ్యపెట్టారు. ఎన్నికలు అయిన తరువాత మా ఇష్టానుసారం చేస్తామన్న ధోరణి మంచిది కాదు. ఈ అధికారం మీకు లేదు. ఆ రోజు ఏం చెప్పారు.. ఈరోజు ఎలా మోసం చేశారో అనేది ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు.
టీడీపీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయమనడం ఏమిటి? రాజీనామా చేసేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి ముందుకు రావాలి. మా సవాల్‌ను స్వీకరిస్తారా లేదా? అని ప్రశ్నించారు. మళ్లీ ఎన్నికలకు వెళ్లి ప్రజామోదంతో ఏ నిర్ణయమైనా తీసుకోవాలి. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పును మేం స్వాగతిస్తామని తెలిపారు. 48 గంటల తరువాత బుధవారం సాయంత్రం 5 గంటలకు మళ్లీ మీడియా ముందుకు వస్తా. ఈలోగా ప్రభుత్వం తేల్చుకోవాలని సవాల్ విసిరారు.
రాజధాని అంశంపై 48 గంటల్లో అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు సిద్ధం కావాలంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సవాల్ కు మంత్రి పేర్ని నాని ఘాటు రిప్లయి ఇచ్చారు. నాడు భూములు ఇచ్చిన అమరావతి రైతులకు కౌలు ఇవ్వకుండా వాళ్లకు వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు అంటూ విమర్శించారు. జగన్ వద్ద నుండి ఎప్పటికీ అధికారం రాదేమోనన్న భయంతో చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆ రాజీనామాలు ఏవో మీరే చేసి రండి, ప్రజాక్షేత్రంలో చూసుకుందాం అంటూ చంద్రబాబుకు సవాల్ విసిరారు.
ఎమ్మెల్యే గుడివాడ అమర్ మాట్లాడుతూ, జగన్ కు చంద్రబాబు 48 గంటల సమయం ఇవ్వడం తనను ఆశ్చర్యానికి గురి చేస్తోందని చెప్పారు. ఏడాదిన్నర క్రితం అమరావతి సహా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఘోరంగా ఓడిపోయిన సంగతిని చంద్రబాబు మర్చిపోయారా? అని ప్రశ్నించారు. వైసీపీకి సవాల్ విసిరే ముందు టీడీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలతో చంద్రబాబు రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. అమరావతిలో రియలెస్టేట్ వ్యాపారం కోసమే చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. మూడు రాజధానులతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని... అందుకే అధికార వికేంద్రీకరణకు ప్రజలంతా ఆమోదం తెలుపుతున్నారని చెప్పారు.