Chandragiri, Jan 15: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి పులివర్తి నానీని పరామర్శించారు. దొంగ ఓట్ల అంశంపై నిరాహార దీక్ష చేపట్టిన పులివర్తి నాని అస్వస్థతకు గురికావడంతో ఆయనను స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె వచ్చిన చంద్రబాబు... ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి చంద్రగిరిలో ఇంట్లోనే చికిత్స పొందుతున్న పులివర్తి నానితో మాట్లాడారు. అనంతరం, మీడియా సమావేశం ఏర్పాటు చేసి జగన్ పాలనపై మండిపడ్డారు.
చంద్రగిరిలో వేల సంఖ్యలో దొంగ ఓట్లు చేర్చారు. తిరుపతి, పీలేరు, శ్రీకాళహస్తి, సత్యవేడులోనూ దొంగ ఓట్లు చేర్చారు. ఇలా విచ్చలవిడిగా చేర్చుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు? ఎన్నికల అక్రమాలపై తిరుపతి జిల్లా కలెక్టర్‌పై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. కొన్ని చోట్ల పోలింగ్ బూత్‌లు మార్చేశారు. ఒకే వ్యక్తికి మూడు వేర్వేరు చోట్ల ఓటు ఉంది. అక్రమాలు చేసిన అధికారులను జైలుకు పంపించే అవకాశం ఉంటుంది. సచివాలయ సిబ్బంది సాయంతోనే దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారు. బోగస్ గుర్తింపు కార్డులు కూడా ఇస్తున్నారు. ఈ స్థాయిలో అక్రమాలు చేయడం గతంలో ఎప్పుడూ చూడలేదని మండిపడ్డారు.
ఆధార్ కార్డుతో ఓటర్ కార్డును అనుసంధానం చేయటం ద్వారా దొంగ ఓట్ల నమోదును అడ్డుకోవచ్చని సూచించారు. తుది ఓటర్ల జాబీతా వచ్చేలోపు ఆధార్ కార్డుతో ఓటర్ కార్డును అనుసంధానం చేయటానికి కృషి చేస్తామని వెల్లడించారు. నా రాజకీయ జీవితంతో పోలిస్తే ఓనమాలు కూడా తెలియని వారు నా పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అలాంటి వారికి పుట్టగతులు ఉండవు. ఎన్నికల అరాచకాలకు చంద్రగిరి ఒక కేస్ స్టడీగా మారింది.
చంద్రగిరిలో సమగ్రమైన ఆదారాలను పులివర్తినాని సేకరించారు. ఈ పని చేయాల్సింది ఎన్నికల కమిషన్. ఇందుకోసం నిధులు కూడా ఖర్చు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చంద్రగిరి లాంటి ఓట్ల అక్రమాలు జరిగిన నియోజక వర్గాలు 8,9 ఉన్నాయి. ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోకపోతే వీళ్ల అరాచకాలు పేట్రేగిపోతాయని చంద్రబాబు" ఆవేదన వ్యక్తం చేశారు.
గత 40 ఏళ్లుగా నేను ఈ జిల్లాను చూస్తూ వస్తున్నాను. ఏన్నడూ లేనంతగా మనీ పవర్, భూకబ్జాలు, దోచుకోవడం లాంటివి ఇప్పుడు చూస్తున్నా. అలా దోచుకున్న డబ్బును తీసుకొచ్చి యథేచ్ఛగా పంపిణీ చేసి ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇకపై ఇలాంటివి జరగనివ్వం. రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకున్నారు. వైసీపీని ఇంటికి పంపడం ఖాయం. మేం ఎట్టి పరిస్థితుల్లో ఎవరినీ వదిలిపెట్టం. అధికారులకూ ఇదే మా హెచ్చరిక. చట్ట ప్రకారం విధులు నిర్వర్తించండి.
చట్టాన్ని ఉల్లంఘించి ఇష్టానుసారం చేస్తానంటే మాత్రం ఊరుకోం. అక్రమాలకు పాల్పడుతోన్న అధికారుల ప్రవర్తనపై కేంద్ర ఎన్నికల సంఘం, డీవోపీటీకి పూర్తి వివరాలు అందిస్తాం. వారు చేసిన అక్రమాలకు సంబంధించిన అన్ని విషయాలు ఆధారాలతో సహా కోర్టుకు సమర్పిస్తాం. ఎవరినీ వదిలిపెట్టం.. తప్పు చేసిన వారిని జైలుకు పంపించేవరకు ఊరుకోం. అంగన్వాడీలు, ఉద్యోగులను ఈ ప్రభుత్వం మోసం చేసింది. టీడీపీ అధికారంలోకి రాగానే అందరి సమస్యలు పరిష్కరిస్తాం’’ అని చంద్రబాబు తెలిపారు.