Amaravari, July 27: ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం కేంద్రంగా పసికందులను విక్రయిస్తున్న ఆస్పత్రి గుట్టును (Child trafficking racket in Vizag) విశాఖ నగర పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో కీలక సూత్రధారి, ప్రధాన నిందితురాలు డాక్టర్ పచ్చిపాల నమ్రతతో పాటు మరో ఆరుగురిని అరెస్ట్ చేశారు. సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా కర్ణాటక రాష్ట్రం దావణగిరి ప్రాంతంలో డాక్టర్ నమ్రతను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను ఇవాళ సాయంత్రం విశాఖ కోర్టులో హాజరు పరచనున్నారు. అలాగే నిందితుల కస్టడీ కోసం పోలీసులు పిటిషన్ దాఖలు చేయనున్నారు. దీనిపై పోలీసులు కూపి లాగితే దిమ్మతిరిగే నిజాలు తెలిసాయి.
కేసు (Child Trafficking Case) వివరాల్లోకెళితే.. ప్రధాన నిందితురాలు అయిన డాక్టర్ పచ్చిపాల నమ్రత (Patchipala Namratha) విశాఖలో జిల్లా పరిషత్ ప్రాంతంలో సృష్టి టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత కాలంలో పిల్లల అక్రమ రవాణాలో సృష్టి ఆస్పత్రిదే కీలక పాత్ర అయింది. పసిపిల్లలను విక్రయించడం, ఇతరత్రా విషయాలపై ఆమెపై 2018లో రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో ఆస్పత్రి పేరును యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్‌గా (Universal Srushti Hospital) మార్చి మళ్లీ దందాలు ప్రారంభించారు. సోనూసూద్ సాయం వెనుక కథ ఏంటి? ట్రాక్టర్ తీసుకున్న రైతు ఏమంటున్నారు, సోనూసూద్ గొప్ప మనసుపై సోషల్ మీడియా వేదికగా పొగడ్తల వర్షం
ఆ తర్వాత హైదరాబాద్, విజయవాడ, భువనేశ్వర్, కోల్‌కతాలో నాలుగు బ్రాంచ్‌లు ప్రారంభించారు. ఆస్పత్రి ఎండీ నమ్రత విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనే కాకుండా ఒడిశా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తుండేవారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న ఆశా వర్కర్ల (ASHA workers) ద్వారా పేద బాలింతలు, అక్రమ సంబంధాల ద్వారా కలిగే గర్భవతుల వివరాలను తెలుసుకునే వారు. వారిపై వల విసిరి వారి అవసరాలను ఆసరాగా చేసుకుని ఈ అక్రమం దందా నడిపే వారని పోలీసుల విచారణలో తేలింది.
ఉచిత వైద్య శిబిరాల సాయంతో ఆశా వర్కర్ల ద్వారా పేద బాలింతల వివరాలు సేకరించి, ఉచితంగా డెలివరీ చేయిస్తామంటూ విశాఖ సృష్టి ఆస్పత్రికి తరలించేవారు. డెలివరీ తర్వాత తల్లులకు కొంత మొత్తాన్ని ఇచ్చి పిల్లలు లేని ధనవంతుల దగ్గర పెద్ద మొత్తం వసూలు చేసి ఆ పసికందులను విక్రయించేవారు. కొనుగోలు చేసిన తల్లిదండ్రులకే చిన్నారులు పుట్టినట్లుగా తప్పుడు బర్త్ సర్టిఫికెట్లు కూడా సృష్టించేవారు. ఇందుకు సంబంధించి జీవీఎంసీ అధికారుల పాత్రపైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇదే పద్ధతిలో వి.మాడుగుల మండలం కానికారమాత కాలనీకి చెందిన మహిళను కూడా నమ్మించి మార్చి 9న ఆస్పత్రిలో చేర్పించారు. అదే రోజు ఆమె మగబిడ్డను జన్మనివ్వడంతో ఆ పసికందును పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన దంపతులకు విక్రయించారు. ఇప్పుడు ఈ దందా బట్టబయలు అవ్వడంతో కటకటాలు లెక్కపెట్టాల్సిన పరిస్థితి ఎదురయింది. ఈస్ట్ ఏసీపీ కులశేఖర్ పర్యవేక్షణలో మహారాణిపేట సీఐ జి.సోమశేఖర్, గాజువాక క్రైం సీఐ పి.సూర్యనారాయణ, హార్బర్ సీఐ ఎం.అవతారం, మహారాణిపేట ఎస్‌ఐ పి.రమేష్ ఈ కేసు దర్యాప్తులో పాల్గొన్నారు. నగర పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ దీనికి సంబంధించి న వివరాలను వెల్లడించారు.
వెలుగులోకి వచ్చింది ఇలా..
మహిళ గర్భవతిగా ఉన్న సమయంలో అంగన్‌వాడీలు ఆమెకు పౌష్టికాహారం అందిస్తూ వచ్చారు. అయితే ఆ మహిళ డెలివరీ విషయాన్ని దాచిపెట్టింది. విషయం తెలిసిన అంగన్ వాడీలు ఆమెను బిడ్డ విషయం అడగగా నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో ఈ ఏడాది మార్చి 14న చైల్డ్‌లైన్‌కు సమాచారం అందించింది.దీనిపై చైల్డ్‌లైన్ సిబ్బంది విచారణ చేపట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ముఠా సభ్యులు విక్రయించిన పసికందును మార్చి 20న వెనక్కి తీసుకువచ్చారు. చైల్డ్‌లైన్ సిబ్బంది బేబీని శిశుగృహలో చేర్పించి విషయాన్ని పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు జరిగిన విషయంపై దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో ప్రస్తుత కేసుతో పాటు అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
చైల్డ్‌లైన్ నుంచి వచ్చిన సమాచారం మేరకు విచారణ చేపడితే చాలా అక్రమాలు వెలుగులోకి వచ్చాయని సీపీ ఆర్కే మీనా (Police Commissioner R.K. Meena) చెప్పారు. పిల్లలను విక్రయిస్తున్న యూనివర్సల్ సృష్టి ఆస్పత్రి ఎండీ పచ్చిపాల నమ్రతతో పాటు ఓ డాక్టర్, ఇద్దరు ఆశా వర్కర్లను, వారికి సహకరించిన ఇద్దరు వ్యక్తులను, పసిబిడ్డను కొనుగోలు చేసిన పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన ఇద్దరితో కలిపి 8 మందిని అరెస్టు చేసినట్టు చెప్పారు. ఆస్పత్రి ఎండీ డాక్టర్ పచ్చిపాల నమ్రతతో పాటు ఆశా వర్కర్లు కోడి వెంకటలక్ష్మి, బొట్టా అన్నపూర్ణ ఏ2, ఏ3లుగా, ఏజెంట్‌గా వ్యవహరించిన అర్జి రామకృష్ణను ఏ4గా, ఆస్పత్రి ఎండీ దగ్గర పనిచేస్తున్న వైద్యురాలు తిరుమలను ఏ5గా, ఎండీ దగ్గర పనిచేస్తున్న లోపింటి చంద్రమోహన్‌ను ఏ6గా, పసికందును కొనుగోలు చేసిన పశ్చిమబెంగాల్‌కు చెందిన ఇద్దరిని ఏ7, ఏ8గా గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపారు.