స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించాలంటూ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసింది. ఈ కేసులో రాజమహేంద్రవరం జైలులో ఉన్న చంద్రబాబుకు రెండోదఫా విధించిన రిమాండ్ గడువు గురువారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో సీఐడీ మళ్లీ మెమో దాఖలు చేసింది. నేటితో చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్ ముగుస్తున్నందున ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట వర్చువల్‌గా ఆయన్ను హాజరుపరిచే అవకాశం ఉంది.
మరోవైపు ఈ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు మళ్లీ ప్రారంభమయ్యాయి. బుధవారం చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌కుమార్ దూబే, సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. సీఐడీ తరఫు వాదనలు పూర్తికాకపోవడంతో విచారణ నేటికి వాయిదా పడింది. నిన్నటి వాదనలకు కొనసాగింపుగా ప్రస్తుతం అదనపు ఏజీ పొన్నవోలు వాదనలు వినిపిస్తున్నారు.
చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా, ఏసీబీ కోర్టులో ఇరువురి వాదనలు ఇవిగో..
ఫైబర్‌నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో మళ్లీ వాదనలు ప్రారంభమయ్యాయి. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ అగర్వాల్ వాదనలు వినిపిస్తున్నారు. బుధవారమే ఆయన వాదనలు వినిపించగా.. పూర్తిస్థాయిలో వినేందుకు తగిన సమయం లేకపోవడంతో విచారణను న్యాయమూర్తి నేటికి వాయిదా వేశారు. దీంతో మళ్లీ నేడు వాదనలు కొనసాగుతున్నాయి.
బుధవారం న్యాయవాది సిద్ధార్థ అగర్వాల్ వాదనలు వినిపిస్తూ టెరాసాఫ్ట్ సంస్థకు టెండర్ ఖరారు విషయంలో సాంకేతిక కమిటీ, టెండర్ అవార్డు కమిటీలో చంద్రబాబు సభ్యుడిగా లేరన్నారు. విధానపరమైన నిర్ణయాల అమలు విషయంలో కొందరు చేసిన తప్పులకు, ఆర్థిక అక్రమాలకు, చోటు చేసుకున్న లోపాలకు అప్పటి ముఖ్యమంత్రిని బాధ్యుడిని చేయడం సరికాదన్నారు. రాజకీయంగా బలమైన ప్రత్యర్థిగా ఉన్న పిటిషనర్‌ను కారాగారంలో ఉంచాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో దురుద్దేశంతో తప్పుడు కేసులో ఇరికించారని వాదించారు.