Visakhapatnam, Feb 9: విశాఖ శారదాపీఠం నిర్వహిస్తున్న వార్షికోత్సవాలకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ (CM Jagan Visits Sarada Peetham) హాజరయ్యారు. శ్రీ శారదా పీఠంలో మూడో రోజు కొనసాగుతున్న రాజశ్యామలాదేవి యాగంలో పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి... ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి సమక్షంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan Mohan Reddy) పాల్గొన్నారు. విశాఖ శ్రీ శారదాపీఠం వార్షిక మహోత్సవాలకు హాజరైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రుద్ర హోమం పూర్ణాహుతికి సీఎం హాజరయ్యారు.
విజయ గణపతి, శంకరాచార్య, వనదుర్గ ఆలయాల సందర్శించారు. రాజశ్యామల పూజ కోసం వేద పండితులు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సంకల్పం చేయించారు. తర్వాత సీఎం చేతులమీదుగా కలశ స్థాపన చేయించారు. అనంతరం వేద పండిత సభలో ఆయన పాల్గొన్నారు. రాజశ్యామలాదేవి యాగంలో సీఎం వైఎస్ జగన్‌తోపాటు మంత్రులు అవంతి శ్రీనివాస్.. ధర్మాన కృష్ణదాస్... టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, ఆయన సతీమణి స్వర్ణమ్మ పాల్గొన్నారు.
ఏటా సంప్రదాయబద్దంగా నిర్వహించే వార్షికోత్సవాలు ఈ ఏడాది కూడా ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. తొలిరోజు గురువందనం, గోపూజతో ఈ ఉత్సవాలకు పీఠాధిపతి సర్వపానందేంద్ర, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి మహాస్వాములు అంకుర్పారణ చేశారు. తర్వాత గణపతిపూజ, పుణ్యహవచనం, అగ్నిమధనం, రాజశ్యామల యాగం, నిత్యపీటపూజ, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారికి మహా మంగళహారతి ఇచ్చారు.