Coronavirus in AP: కోవిడ్ 19 మీద చంద్రబాబు జాగ్రత్తలు, ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 10 లక్షల విరాళం, లాక్‌డౌన్‌ను అందరూ కచ్చితంగా ఆచరించాలని వినతి
Andhra Pradesh CM Chandrababu Naidu | (Photo Credits: ANI)

Amaravati, Mar 25: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్‌ (Coronavirus in andhra pradesh) విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu Naidu) పలు జాగ్రత్తలు సూచించారు. కరోనావైరస్‌ వల్ల మన దేశంలో 20 నుంచి 50 లక్షల మంది వరకూ చనిపోయే అవకాశం ఉందని ప్రతిపక్ష నేత చెప్పారు. సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ డైనమిక్స్, ఎకనామిక్స్‌ అండ్‌ పాలసీ (సీడీడీఈపీ) అమెరికాలోని ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీ ఈ మేరకు అంచనా వేసిందని తెలిపారు.

కరోనావైరస్ ఎఫెక్ట్,  ఆంధ్ర ప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు వాయిదా

హైదరాబాద్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలను తెలిపారు.సామాజికంగా దూరంగా ఉంటూ మానసికంగా దగ్గరగా ఉండేందుకు డిజిటల్‌ సోషలైజేషన్‌ (Digital Socialization) ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. ప్రజలంతా ఇదే పాటించాలని పిలుపిచ్చారు. ‘ఉద్యోగులు తమ విధులను డిజిటల్‌ సోషలైజేషన్‌ ద్వారా నిర్వర్తించాలి. సెల్‌ఫోన్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ముఖాముఖి చర్చించుకుని విధులు నిర్వర్తించాలని కోరారు.

లాక్‌డౌన్ రూల్స్ పాటించకుంటే కఠిన చర్యలు

ప్రధాని మోదీ (PM Modi) పిలుపుతో జనతా కర్ఫ్యూకు ప్రజలంతా సంఘీభావంగా నిలిచారు. ఆయన ప్రకటించిన లాక్‌డౌన్‌ను కూడా అందరూ పాటించాలి. అప్పుడే ఈ భయంకర వైర్‌సను నియంత్రించగలుగుతాం. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని పాటించకపోవడం సరికాదు. మరోవైపు కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో పేదలు ఉపాధి కోల్పోయారు. వీరందరికీ ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని కోరారు.

సెల్ఫీ వీడియోలో కరోనా పేషెంట్ కన్నీటి ఆవేదన

జనసాంద్రత ఎక్కువ ఉండే ఇండియా లాంటి దేశంలో 20 కోట్ల నుంచి 30 కోట్ల మందికి ఈ వ్యాధి విస్తరించే ప్రమాదం ఉందని వారి అధ్యయనంలో తేలింది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ప్రభుత్వాలు కూడా బాధ్యతగా తీసుకోవాలని తెలిపారు.

మార్చి 31 వరకు ఏపీ లాక్‌డౌన్

ఈరోజే రాజ్యసభ ఎన్నికలను కూడా వాయిదా వేశారు. ఎమ్మెల్యేలంతా ఓటేయడానికి వస్తే టచ్‌ పాయింట్లు పెరిగే ప్రమాదం ఉందని, ఇది మరింత విస్తరిస్తుందని, అది సమాజానికి ముప్పుగా పరిణమిస్తుందని ఆ ఎన్నికలు వాయిదా వేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కూడా ప్రభుత్వం ఆలోచించాలని కోరారు.

రాజకీయ విమర్శలకు ఇది సమయం కాదన్నది ప్రభుత్వం తెలుసుకోవాలని చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పుడు జరగాల్సింది కరోనా వైర్‌సను ఏవిధంగా ఎదుర్కొంటామన్నదే. మనల్ని మనం కాపాడుకోవాలి. మన చుట్టుపక్కల వాళ్లను కాపాడుకోవాలి. వైరస్‌ సోకినవాళ్లు, సోకనివాళ్లు అంతా బాధ్యతగా ప్రవర్తించాలి. మనందరి సామాజిక బాధ్యతగా గుర్తించాలి’ అని విజ్ఞప్తి చేశారు.

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్

కాగా నివారణ, బాధితుల సహాయానికి వినియోగించేందుకు తమ నెల జీతాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌)కి విరాళంగా ఇవ్వాలని టీడీపీ శాసనసభాపక్షం తరఫున విపక్షనేత చంద్రబాబు నిర్ణయించారు. వ్యక్తిగతంగా తన కుటుంబం నుంచి రూ.10 లక్షల విరాళం ఇస్తానని ఆయన తెలిపారు.

రాష్ట్రంలో మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 8కి చేరుకుంది. ఇటీవల లండన్‌ నుంచి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి వచ్చిన యువకుడికి తిరుపతి స్విమ్స్‌లో చేసిన పరీక్షల్లో వైద్యులు పాజిటివ్‌గా నిర్ధారించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 251 నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించగా, 229 కేసుల్లో కరోనా లేదని తేలింది. మరో 14 కేసుల విషయంలో నివేదికలు రావాల్సి ఉందని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది.