Amaravati, Nov 15: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 79,823 నమూనాలు పరీక్షించగా 1,657 పాజిటివ్ కేసులు (Corona in AP) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య8,52,955కు చేరింది. కొత్తగా ఏడుగురు కరోనా బాధితులు మృతి (Covid Deaths) చెందడంతో ఆ సంఖ్య 6,854కి చేరింది. ఈ మేరకు శనివారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇక గడిచిన 24 గంటల్లో 2,155 మంది కోవిడ్‌ను జయించి డిశ్చార్జ్ అయ్యారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 19,757యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 8,26,344 మంది రికవరీ అయ్యారు. ఇప్పటివరకు ఏపీలో 91.01 లక్షల కరోనా టెస్టులు చేశారు. కృష్ణా జిల్లాలో ఇద్దరు, అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఒక్కరు చొప్పున కరోనాతో మృతి చెందారు.
ఇదిలా ఉంటే విశాఖ మన్యం పాడేరులో పీపీఈ కిట్‌తో (Personal Protective Equipment) ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. అతన్ని చూసిన జనాలు కోవిడ్ రోగి అందరికీ అంటిస్తున్నాడని భయంతో పరుగులు తీశారు.పాడేరు రహదారిపై శనివారం ఉదయం ఓ వ్యక్తి రోడ్డుపై పీపీఈ కిట్ ధరించి కనిపించాడు. అందరి దగ్గరుకి వెళ్లి పలకరించడానికి ప్రయత్నించాడు. అయితే ప్రజలంతా భయంతో ఆయన దగ్గరకు వెళ్లకుండా పరుగులు తీసారు. ఈ విషయం వైద్య అధికారులకు చేరడంతో తమ ఆస్పత్రిలో కోవిడ్ రోగులు తప్పిపోయారేమోనని సరిచూసుకున్నారు. అయితు అందరూ ఉండడంతో ఆ వ్యక్తి రోగి కాదని గుర్తించారు.
దాదాపు రెండు గంటల పాటు పాడేరు మెయిన్ రోడ్డుపై ఈ అపరిచితుడు సంచరించడంతో ప్రజలకు కొంత ఆందోళనకు గురయ్యారు. తీరా అతన్ని ఆపి దూరం నుంచే ప్రశ్నించగా.. ఆ వ్యక్తి చెప్పిన సమాధానం విని అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. చలి తీవ్రత తట్టుకోలేక పీపీఈ కిట్ వేసుకున్నానని చెప్పడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం అతనితో పీపీఈ కిట్ విప్పించి అక్కడి నుంచి పంపించి వేశారు.