COVID-19 Outbreak in India | File Photo

Amaravati, July 14: ఏపీలో కొత్తగా 1,916 కరోనా పాజిటివ్‌ కేసులు (AP Coronavirus Update) నమోదయ్యాయి. ఇందులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 8 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా వైరస్‌ (COVID-19) సోకిన వారి సంఖ్య 33,019కి చేరుకుంది. గత 24 గంటల్లో కోవిడ్‌ నుంచి కోలుకుని 952 మంది క్షేమంగా డిశ్చార్జ్‌ కాగా, ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 17,467 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. దేశంలో 24 గంటల్లో 28,498 కొత్త కేసులు, 540 మరణాలు, 9,07,645కు చేరుకున్న కోవిడ్-19 కేసులు, కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 5,71,460 మంది

గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి అనంతపురంలో పది మంది, పశ్చిమ గోదావరిలో తొమ్మిది మంది, చిత్తూరులో ఐదుగురు, తూర్పుగోదావరిలో ఐదుగురు, కడపలో ఐదుగురు, కర్నూలులో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, విశాఖపట్నంలో ఇద్దరు, విజయనగరంలో ఒకరు.. మొత్తం 43 మరణించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 408 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో 22,670 శాంపిల్స్‌ను పరీక్షించగా, ఇప్పటివరకు ఏపీలో 11,95,766 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 15,144 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

నంద్యాలలో 10 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా కేసులు పెరుగుతున్నా నేపథ్యంలో అధికారులు ఆంక్షలు కఠినతరం చేశారు. రేపటి నుండి 25 వరకు అత్యవసర సర్వీసులు మాత్రమే సడలింపు ఇచ్చారు. నిత్యావసర సరుకులు, రిటైల్‌ కూరగాయల అమ్మకాలకు ఉదయం ఆరు గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే అనుమతి ఇచ్చారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు లాక్‌డౌన్‌ అమలులో ఉంటుంది. ప్రతి వ్యక్తి మాస్కు తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని మున్సిపల్‌ కమిషనర్‌ వెంకట కృష్ణ, డీఎస్పీ చిదా నందరెడ్డి విజ్ఞప్తి చేశారు.

విశాఖ జిల్లాలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న వ్యక్తికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల 11న ఆరిలోవ శ్రీకాంత్ నగర్‌కు చెందిన భూతల శ్రీను మహేష్‌(48) అనే వ్యక్తి నలుగు అంస్థుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆత్మహత్య చేసుకున్న రోజు స్థానికులు భారీగా సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం బాధితుడికి కరోనా సోకిన విషయం తెలియగానే శ్రీకాంత్‌ నగర్‌ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తనకు కరోనా సోకిందనే మహేష్‌ ఆత్మహత్య చేసకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఆరిలోవ పోలీసులకు సైతం కరోనా భయం పట్టుకుంది.