Coronavirus Cases in India (Photo Credits: PTI)

Amaravati, June 1: తెలుగు రాష్ట్రాల్లో కరోనావైరస్ (Covid-19 in Telugu States) చాపకిందు నీరులా విస్తరించుకుంటూ వెళుతోంది. లాక్ డౌన్ సడలింపులు ( Lockdown Relaxation) మరింతగా ఇచ్చిన నేపథ్యంలో కేసులు రొజు రోజుకు పెరిగిపోతున్నాయి. తెలంగాణలో ( Telangana) రికార్డు స్థాయిలో ఒక్కరోజే 199 కేసులు రావడం అక్కడ ఆందోళన కరంగా మారింది. ఏపీలో (Andhra pradesh) తగ్గుముఖం పట్టిన కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. 418 కేసులు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలవి కావడంతో ఆందోళనకరంగా మారింది. రాష్ట్రాల వారీగా చూస్తే.. దేశంలో కరోనా కల్లోలం, ఆసియాలో అగ్రస్థానంలోకి భారత్, దేశ వ్యాప్తంగా 2 లక్షలకు చేరువలో కోవిడ్-19 కేసులు, మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపిన ప్రధాని మోదీ

ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్‌ నుంచి 51 మంది కోలుకోవడంతో వారిని డిశ్చార్జి చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. ఇందులో 8 మంది వలస కూలీలు ఉన్నారు. దీంతో మొత్తం కరోనా వైరస్‌ నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,332కు చేరింది. శనివారం మొత్తం 9,370 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో 110 మందిలో పాజిటివ్‌ లక్షణాలు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. వీరిలో 12 మంది వలస కార్మికులున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య 3,571కు చేరింది. ఇందులో 418 కేసులు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలవి కాగా, కోయంబేడుకు సంబంధించినవి 226, విదేశాల నుంచి వచ్చిన 111 మంది ఉన్నారు. వీరిని మినహాయిస్తే రాష్ట్రంలో కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య 2,816గా ఉంది. కృష్ణా జిల్లా, చిత్తూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనా వైరస్‌తో మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 62కు చేరింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,177గా ఉంది.

తెలంగాణ రాష్ట్ర ప్రజలను కరోనా కలవరపెడుతున్నది. తెలంగాణలో కరోనా వ్యాప్తి ప్రారంభమైన నాటి నుంచి ఎన్నడూ లేనంతగా ఆదివారం రికార్డుస్థాయిలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 199 నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తున్నది. వీరిలో తెలంగాణవారు 196 మంది ఉండగా, వలస కార్మికులు ముగ్గురున్నారు. కొన్ని రోజులుగా పాజిటివ్‌ కేసులు నమోదుకాని జిల్లాల్లో కూడా వైరస్‌ నిర్ధారణ అయ్యింది. తెలంగాణకు చెందిన 196 మందిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 122 మంది ఉండగా, రంగారెడ్డి జిల్లాలో 40, మహబూబ్‌నగర్‌ 3, సూర్యాపేట 1, నిర్మల్‌ 1, వరంగల్‌ అర్బన్‌ 2, యాదాద్రి 1, మేడ్చల్‌ 10, జగిత్యాల 3, మెదక్‌ 3, ఖమ్మం 9, జనగామ జిల్లాలో ఒకరున్నారు. 16 మంది డిశ్చార్జి కాగా, అయిదుగురు మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,698 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా, అందులో 82 మంది మరణించగా, 1,428 మంది చికిత్స ద్వారా కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మిగిలిన 1,188 మంది ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.