పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తీవ్ర తుఫాన్ (Cyclone Michaung Update) బాపట్ల సమీపంలో తీరాన్ని దాటిందని (Michaung crosses AP coast) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. తీరం వెంబడి గంటకు 90-100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచాయని వాతావరణ శాఖ పేర్కొంది. రాగల రెండు గంటల్లో తీవ్ర తుఫాన్ తుఫానుగా బలహీనపడనుంది. అనంతరం 6 గంటల్లో వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తుపాను తీరం దాటినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తీరం దాటినప్పటికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల సంస్థ వెల్లడించింది. అయితే తుపాను తీరం దాటినప్పటికీ రేపు (డిసెంబరు 6) కూడా వర్షాలు పడతాయని ఏపీఎస్ డీఎంఏ వెల్లడించింది. బుధవారం నాడు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, బాపట్ల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తీరం దాటినప్పటికీ ప్రతికూల వాతావరణం కారణంగా మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని ఏపీఎస్ డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ అంబేద్కర్ వెల్లడించారు.
ఇప్పటికే బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో వేగంగా గాలులు, ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. అర్ధరాత్రి వరకు ఇదే వేగంతో గాలులు, వర్షాలు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. పశ్చిమ గోదావరి, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో నష్టం ఎక్కువగా జరిగింది. రాయలసీమ ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లోనూ తుపాను ప్రభావం కనిపించింది. వరి, పొగాకు, పసుపు, అరటి పంటలు దెబ్బతిన్నాయి.
తుపాను ప్రభావంతో ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల కూలాయి. ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద భారీగా నీరు నిలిచిపోయింది. ఆస్పత్రి లోపల కూడా నీరు చేరడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. పెదవేగి, పెదపాడు, వట్లూరు తదితర ప్రాంతాల్లో రహదారికి అడ్డంగా చెట్లు కూలిపోయాయి. పోలవరం, జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెం, టి.నరసాపురం తదితర మండలాల్లో వేరుశనగ, పొగాకు, మినుము పంటలు నీట మునిగాయి
తుపాను (Cyclone Michaung) ప్రభావంతో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పల్లం రహదారిపై వాగులు పొంగిపొర్లుతుండటంతో రాకపోకలు స్తంభించాయి. పాపా నాయుడుపేట-చెన్నంపల్లి రహదారి కొట్టుకుపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని పానగల్ విద్యుత్ ఉపకేంద్రం ఆవరణలోకి పెద్దఎత్తున వరద నీరు చేరి ట్రాన్స్‌ఫార్మర్లు నీట మునిగాయి. పట్టణంలోని పేదల గుడిసెల్లోకి నీరు చేరడంతో అధికారులు పునరావాస కేంద్రానికి తరలించారు.