బాపట్ల, డిసెంబర్ 5: మిచౌంగ్ తీవ్ర తుఫాన్ బాపట్ల వద్ద తీరాన్ని తాకింది. మరో గంటలో ఇది పూర్తిగా తీరాన్ని దాటుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తీరాన్ని తాకే సమయంలో బాపట్ల వద్ద అలలు రెండు మీటర్ల ఎత్తున ఎగసిపడ్డాయి. ప్రస్తుతం బాపట్లలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రచండగాలులతో భారీ వర్షం కురుస్తోంది. మిచాంగ్ తుపాను పూర్తిగా తీరం దాటిన తర్వాత బలహీనపడి వాయుగుండంగా మారనుంది. బాపట్ల వద్ద కేవలం 4 గంటల వ్యవధిలోనే 43.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రస్తుతానికి తుపాను ముందు భాగం పూర్తిగా భూభాగంపైకి ప్రవేశించిందని ఐఎండీ తన తాజా బులెటిన్ లో వెల్లడించింది.
దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి చేరువలో 'మైచాంగ్' తుపాను ల్యాండ్‌ఫాల్ ప్రక్రియ ప్రారంభమైందని, మరో 3 గంటల పాటు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ మంగళవారం తెలిపింది. గరిష్టంగా గంటకు 90-100 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ల్యాండ్ ఫాల్ ప్రక్రియ కొనసాగుతోంది మరియు వచ్చే 3 గంటల పాటు కొనసాగే అవకాశం ఉంది" అని IMD అంచనా వేసింది. సముద్రంలో అలలు సుమారు 2మీటర్ల మేర ఎగసిపడుతున్నాయి.
మిచౌంగ్ తుఫాన్ కారణంగా సంతనూతలపాడు మండలం మంగమూరు-ఒంగోలు మధ్యలోనీ రోడ్డుపై పారుతున్న వర్షపు నీరుతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.రెండు రోజుల వరకు ఈ రోడ్డులో ఎవరు ప్రయాణం చేయవద్దని అధికారులు సూచించారు.
చిత్తూరు జిల్లా తూర్పు మండలాల్లో మిచౌంగ్ తుఫాను భీభత్సం సృష్టిస్తోంది. ఎస్‌ఆర్ పురం, కార్వేటినగం, గంగాధర నెల్లూరు మండలాల్లో వర్షానికి వాగులు పొంగిపొర్లుతున్నాయి. సుమారు 15 గ్రామాలకుపైగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎన్టీఆర్ జలాశయంలో రెండు గేట్ల ద్వారా నీటిని బయటకు విడుదల చేశారు. కృష్ణాపురం జలాశయంలో ఒక గేటు ద్వారా అధికారులు నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. చుట్టుపక్కల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
తుపాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా పలు తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాలు, ఈదురుగాలుల తీవ్రతతో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో నష్టం ఎక్కువగా జరిగింది. రాయలసీమ ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లోనూ తుపాను ప్రభావం కనిపించింది. వరి, పొగాకు, పసుపు, అరటి పంటలు దెబ్బతిన్నాయి. ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి.