Vjy, Oct 28: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాన్ వేగంగా శక్తిని పెంచుకుంటూ, తీవ్ర తుపానుగా మారి ఆంధ్రప్రదేశ్ తీరానికి దూసుకొస్తోంది. గత ఆరు గంటల్లో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ-ఉత్తర పశ్చిమ దిశగా కదులుతున్న ఈ తుపాన్ ప్రస్తుతం కాకినాడకు 190 కిలోమీటర్లు,మచిలీపట్నానికి 110 కిలోమీటర్లు,విశాఖపట్నానికి 280 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ విభాగం (IMD) వెల్లడించింది.
వాతావరణ శాఖ అంచనా ప్రకారం,ఈరోజు రాత్రి కాకినాడ–మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉంది. తీరాన్ని దాటే సమయంలో మొంథా తుపాన్ తీవ్రత అధికంగా ఉండి, గంటకు 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఆ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తుపాన్ ప్రభావం పెరిగే కొద్దీ తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, నంద్యాల, బాపట్ల జిల్లాలు ఎక్కువగా ప్రభావితమవుతాయని అంచనా. తీరప్రాంతాల్లోని తక్కువ ఎత్తు ప్రాంతాల్లో నీరు నిలిచే ప్రమాదం ఉండటంతో అధికారులు పౌరులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (SDRF) ప్రఖర్ జైన్ మాట్లాడుతూ ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.
వాతావరణశాఖ ప్రకారం, మొంథా తుపాన్ ప్రభావంతో రేపు ఉదయం వరకు గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా, తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో కూడా తుపాన్ ప్రభావం తీవ్రంగా ఉండి ఆకస్మిక వరదలు (ఫ్లాష్ ఫ్లడ్స్) సంభవించే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
అలాగే ఒడిశాలోని గజపతి, గంజాం జిల్లాల్లో కూడా తుపాన్ ప్రభావం కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. వర్షాల తీవ్రత వల్ల నదులు, వాగులు ఉప్పొంగే ప్రమాదం ఉండటంతో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ అయ్యాయి.
ఇప్పటికే ప్రభుత్వం అన్ని విభాగాలను హై అలర్ట్ చేసింది. మంత్రి నారా లోకేశ్ పర్యవేక్షణలో ఆర్టీజీఎస్ (RTGS) కేంద్రం నుంచి ఉన్నతాధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితులకైనా సిద్ధంగా ఉండాలని, తక్షణమే సహాయ, పునరావాస చర్యలు చేపట్టాలని లోకేశ్ అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
NDRF, SDRF బృందాలు కోస్తాంధ్ర జిల్లాలకు పంపబడ్డాయి. అత్యంత ప్రమాదకర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎవాక్యుయేషన్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తుపాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ సరఫరా, రోడ్ల రవాణా, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లకు ముందస్తు ఏర్పాట్లు చేపట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
మొంథా తుపాన్ కారణంగా ఇప్పటికే విశాఖ, గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, బాపట్ల జిల్లాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. సముద్రం ఉధృతంగా మారడంతో తీరప్రాంత మత్స్యకార గ్రామాల్లో ఆందోళన వాతావరణం నెలకొంది. కొన్నిచోట్ల గాలివానలతో చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి.
ఇదిలావుండగా కేంద్ర ప్రభుత్వం కూడా తుపాన్ పరిస్థితిపై నిఘా వేసింది. వాతావరణ శాఖ తరచూ అప్‌డేట్లు విడుదల చేస్తూ, తుపాన్ కదలికలను సమీక్షిస్తోంది. బంగాళాఖాతంలో గాలుల ఉధృతి మరింత పెరిగే అవకాశముండటంతో, రానున్న 12 గంటలు అత్యంత కీలకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ప్రజల భద్రతే ప్రభుత్వ ప్రాధాన్యమని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ప్రతి జిల్లా కలెక్టర్, తహసీల్దార్, గ్రామ వాలంటీర్లు తమ పరిధిలో ప్రజలకు అవసరమైన సహాయం అందించాలి. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో కూటమి నేతలు, కార్యకర్తలు ప్రజలతో కలసి సహాయక చర్యలు చేపట్టాలి,” అని ఆదేశించారు.
మొంథా తుపాన్ తీరం దాటిన తర్వాత, వాయవ్య దిశగా కదిలి క్రమంగా బలహీనపడే అవకాశం ఉన్నప్పటికీ, తుపాన్ ప్రభావం రెండు రోజులు కొనసాగవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.