బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రమైన తుపాను ‘మొంథా’ (Montha Cyclone) మంగళవారం అర్ధరాత్రి ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటింది. వాతావరణశాఖ (IMD) తెలిపిన వివరాల ప్రకారం, మచిలీపట్నం–కళింగపట్నం మధ్య కాకినాడకు దక్షిణంగా ఉన్న నరసాపురం వద్ద తుపాను తీరం దాటింది. రాత్రి 11.30 నుండి 12.30 మధ్య తీరం దాటే ప్రక్రియ పూర్తయిందని ఐఎండీ వెల్లడించింది.
తీరాన్ని దాటిన తర్వాత కూడా మొంథా తీవ్ర తుపానుగానే కొనసాగుతూ.. తీవ్ర వర్షాలు, బలమైన గాలులను సృష్టిస్తోంది. తీరం దాటే సమయంలో తుపాను గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదిలింది. ప్రస్తుతం ఇది ఉత్తర వాయువ్య దిశగా తెలంగాణ మీదుగా ప్రయాణిస్తూ, బుధవారం మధ్యాహ్నానికి ఛత్తీస్‌గఢ్ వద్ద మరింత బలహీనపడే అవకాశం ఉందని అంచనా.
తుపాను ప్రభావంతో గడిచిన 12 గంటల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లా కావలిలో 23 సెం.మీ, ఉలవపాడులో 17 సెం.మీ, చీరాలలో 15 సెం.మీ వర్షపాతం నమోదైంది.ఈ నేపథ్యంలో బుధవారం కోస్తాంధ్ర, తెలంగాణ రాష్ట్రాలన్నింటికీ రెడ్ అలెర్ట్ ప్రకటించారు. ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండగా, ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో తీవ్ర వర్షాలు పడుతున్నాయి. రాబోయే 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయని వాతావరణశాఖ తెలిపింది.
కోనసీమ జిల్లా అంతర్వేది బీచ్ వద్ద సముద్రం భీకర రూపం దాల్చింది. సుమారు రెండు మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడుతూ లైట్‌హౌస్‌ను తాకుతుండటంతో తీర ప్రాంత ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలో ఏటిగట్లు ప్రమాదకరంగా మారాయి. భోగాపురం వద్ద ఉడేరు నదికి వరద పోటెత్తడంతో గట్లు కోతకు గురవుతున్నాయి.
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే కుండపోతగా వర్షం కురుస్తోంది.రానున్న గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఈ మేరకు తెలంగాణకు 'ఆరెంజ్ అలర్ట్' జారీ చేసింది. వాతావరణ శాఖ సూచన ప్రకారం, రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తూ, ఆ రోజుకు 'ఎల్లో అలర్ట్' ప్రకటించింది.భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాలు చేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.