Amaravati, Nov 27: మూడు రాష్ట్రాలను అతలాకుతలం చేసిన నివర్ తుఫాన్ (Cyclone Nivar Updates) క్రమంగా బలహీనపడింది. ప్రస్తుతం తుపాను దక్షిణ రాయలసీమ పరిసరాల్లో కేంద్రీకృతమై, అల్పపీడనంగా మార్పుతున్నట్లు (Weather Forecast Today) వాతావరణశాఖ తెలిపింది. రాబోయే ఆరు గంటల్లో క్రమంగా ఇది మరింత బలహీనపడే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో చిత్తూరు, నెల్లూరు, కడప, ప్రకాశం, కర్నూలు జిల్లాలో పలుచోట్ల వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
తుపాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తే... కొన్నిసార్లు 60 కిలోమీటర్ల వరకు కూడా గాలులు వీచే అవకాశం ఉంది. దీంతో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మిగతా జిల్లాల్లో చాలా వరకు ఆకాశం మేఘావృతమై ఉండి చెదురుమదురుగా జల్లులు పడే అవకాశం (Rains Latest News) ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
భారీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టానికి దారితీయకుండా తమిళనాడులో నివర్ తుపాన్ గురువారం తెల్లవారుజామున తీరం దాటింది. కేవలం అక్కడ రెండు జిల్లాలపై మాత్రమే ప్రభావం చూపడంతో భారీ నష్టం తప్పింది. గురువారం తెల్లవారుజాము 4 గంటల వరకు భయానక పరిస్థితులు కొనసాగాయి. విల్లుపురం, తిరువణ్ణామలై, కల్లకురిచ్చి, వేలూరు జిల్లాల్లో గురువారం మధ్యాహ్నం వరకు తుపాన్ తీరందాటిన ప్రభావం కొనసాగింది.
పుదుచ్చేరి–మరక్కానం మధ్య విల్లుపురం జిల్లా అళగన్‌కుప్పం ప్రాంతాన్ని ఎన్నడూ ఎరుగని రీతిలో అతిభారీ వర్షం, తీవ్రస్థాయిలో ఈదురుగాలులు కుదిపేశాయి. దీంతో వేలాది వృక్షాలు కూలిపోయాయి. ముగ్గురు మృతి చెందారని అధికారులు తెలిపారు. విద్యుత్ సరఫరాను ముందుగానే నిలిపి వేయడం వల్ల ప్రమాదాలు చోటుచేసుకోలేదు. కడలూరు, విల్లుపురం జిల్లాలో ఊహించిన దానికంటే ఎక్కువ నష్టం సంభవించింది.
ఇంకా నివర్ ముప్పు తొలిగిపోలేదని అధికారులు చెబుతున్నారు. ఈ రోజు కూడా నివర్ తుఫాను ప్రభావం ఉండనుందని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు 55 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని.. దీంతో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తూ.గో, ప.గో, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉంది. మచిలీపట్నం, నిజాంపట్నం ఓడరేవుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణశాఖ సూచనలు చేసింది.
నివర్ తుఫాన్ దెబ్బకు ఏపీలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు 8 జిల్లాలు వణికిపోయాయి. చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలు విలవిలలాడగా ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఈ ప్రభావం కనిపించింది. తుఫాన్ ప్రభావం చిత్తూరు జిల్లాపై ఎక్కువగా కనిపించింది.. ఈదురుగాలులు, భారీ వర్షాలు అతలాకుతం చేశాయి. తిరుపతి సహా తూర్పు మండలాల్లో పెద్దఎత్తున నీరు చేరింది. తిరుమలలోని శ్రీవారి ఆలయం పరిసరాల్లో వరద పారింది. తిరుపతి-మదనపల్లె, కుప్పం-పలమనేరు, పుంగనూరు-ముళబాగల్, పుంగనూరు-బెంగళూరు మార్గంలో రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి.
తిరుమలపై నివర్ ప్రభావం
తిరుమలలో గురువారం తెల్లవారు జామున రెండో ఘాట్ రోడ్డులోని 9, 10, 15 కిలోమీటర్ వద్ద కొండచరియలు విరిగి పడగా, 14వ కిలోమీటర్ వద్ద బొలెరో వాహనంపై బండరాయి పడింది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. తిరుమలోని పాపవినాశనం, గోగర్భం జలాశయాల గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. కుమారధార, పసుపుధార, ఆకాశగంగ డ్యామ్‌లు పూర్తిగా నిండి నీరు పొంగి పొర్లుతోంది. శ్రీవారి మెట్ల మార్గంలో బండరాళ్లు పడుతుండడంతో తాత్కాలికంగా మూసివేసింది.
చిత్తూరుపై నివర్ ప్రభావం
చిత్తూరులోనూ రైల్వే ఓవర్ బ్రిడ్జి కింద చెన్నారెడ్డికాలనీలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం చుట్టూ వరద నీరు చుట్టుముట్టింది. అప్పటికే కార్యాలయంలో ఉన్న ఉద్యోగులు బయటకు రాలేకపోగా.. ఎన్డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది తాడు సాయంతో సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. కాలనీవాసుల్ని కూడా కాపాడారు. చిత్తూరు పక్కనే ఉన్న నెల్లూరుపైనా నివర్ ప్రభావం కనిపించింది. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
నెల్లూరుపై పగబట్టిన నివర్
గూడూరు-మనుబోలు మధ్యలో ఆదిశంకర కాలేజీ దగ్గర చెన్నై-కోల్‌కత జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. వెంకటగిరి-రాపూరు మార్గంలో లింగసముద్రం వద్ద వంతెన కూలిపోగా.. మన్నేగుంట, వెంకటగిరిపాళెం-కోట మార్గాల్లో వంతెనలు కొట్టుకుపోయాయి.. పలు గ్రామాలు నీట మునిగాయి. అక్కడక్కడా స్తంభాలు నేలకూలి విద్యుత్తుశాఖకు సుమారు నష్టం వాటిల్లింది. గూడూరు పట్టణ పరిసరాలు జలదిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. జిల్లాలో వర్షాల పరిస్థితిపై మంత్రి అనిల్‌కుమార్ అధికారులతో సమీక్ష చేశారు.
ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టాయి. సోమశిలకు వరద నీరు పోటెత్తడంతో సోమశిల నుండి భారీగా దిగువకు నీటిని విడుదల చేశారు. సుమారు 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో పెన్నా నది ఉగ్రరూపం దాల్చింది. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
కడపను వణికించిన నివర్ తుఫాను
కడప జిల్లాను తుఫాన్ వణికించింది. రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు, బద్వేలు, కమలాపురం నియోజకవర్గాల్లో రెండు రోజులుగా భారీ వర్షాలు పడ్డాయి. మిగిలిన ప్రాంతాల్లోనూ ఎడతెరిపి లేకుండా మోస్తరు వర్షపాతం నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలకు పంట నష్టం జరిగింది. అలాగే లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. బుగ్గవంక ప్రాజెక్టు నీరు కడప నగరాన్ని చుట్టుముట్టాయి. బుగ్గవంక ప్రాజెక్టుకు వరద నీరు భారీగా చేరుకుంది. ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని అధికారులు దిగువకు వదిలారు. బుగ్గవంక పరీవాహక ప్రాంతాలు నీటిలో చిక్కుకున్నాయి. మిద్దెలపైకి ఎక్కి ప్రజలు ప్రాణాలు దక్కించుకున్నారు. రెస్క్యూ టీమ్‌లు రంగంలోకి దిగాయి. మోటార్ బోట్లతో అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ప్రకాశం, గుంటూరుపై నివర్ ప్రభావం
ఇటు ప్రకాశం జిల్లాను వర్షాలు ముంచెత్తాయి. కుండపోత వానలతో జనజీవనం స్తంభించింది. ఉలవపాడు, కందుకూరు, కొత్తపట్నం,నాగులుప్పలపాడులో భారీ వర్షాలు కురిశాయి. ప్రకాశం జిల్లాలో తుపాను ప్రభావంతో సముద్ర తీర ప్రాంత గ్రామాల్లో భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. అటు అద్దంకి-ముండ్లమూరు మధ్య చిలకలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. నాగులుప్పాడు మండలం కొత్తకోట వద్ద నేల వాగు ఉప్పొంగింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
నివర్ ప్రభావంతో గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి. జిల్లా వ్యాప్తంగా మోస్తరు వర్షం పడటంతో కృష్ణా పశ్చిమడెల్టాలో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. కృష్ణా జిల్లాలోనూ వర్షాలకు వరి, పత్తి పంటలకు తీవ్ర నష్టం కలుగింది. అవనిగడ్డ, మచిలీపట్నం, మోపిదేవి, గుడివాడ, కైకలూరు, నాగాయలంక ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదైంది.
ఉభయ గోదావరి జిల్లాల్లో నివర్ ప్రభావం.
ఇటు ఉభయ గోదావరి జిల్లాల్లోనూ తూర్పుగోదావరి ఎడతెరిపి లేని వర్షాలు కురిశాయి. కాకినాడ, రామచంద్రపురం, రాజమహేంద్రవరం ఈదురుగాలులతో కూడిన జోరువానలు కురిశాయి. పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా బుధవారం రాత్రి నుంచి నిరంతరాయంగా వర్షం కురుస్తూనే ఉంది. 15 మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. తాడేపల్లిగూడెం, ఆచంట, పోలవరం, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, పాలకొల్లు, వీరవాసరం, బుట్టాయాగూడెం, వరిచేలు ఒరిగిపోయాయి.
కృష్ణా జిల్లాపై నివర్ తుఫాను ప్రభావం
కృష్ణా జిల్లా రైతులను నివర్ తుఫాన్ నిలువునా ముంచింది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షంతో వరి, పొగాకు పంటలు దెబ్బతిన్నాయి. జిల్లా వ్యాప్తంగా 27 వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్టు అధికారుల ప్రాథమిక అంచనా. పంట చేతికందే సమయంలో దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యం రంగుమారి గిట్టుబాటు ధర రాదనే ఆవేదనను రైతులు వ్యక్తం చేస్తున్నారు. తుఫాను ప్రభావం ఇలాగే కొనసాగితే వరి కంకులకు మొలకలు వస్తాయని రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉంది.