Tirupati, May 05: తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి (Tirumala Sri venkateswara swamy)వారి భక్తులకు (Devotees) శుభవార్త. మరమ్మతుల కారణంగా గత 6 నెలలుగా మూతపడ్డ శ్రీవారి మెట్టు (Sreevari Mettu) నడక మార్గం గురువారం నుంచి భక్తులకు అందుబాటులోకి రానుంది. గతేడాది నవంబర్లో కురిసిన భారీ వర్షాలకు నడక మార్గం పూర్తిగా ధ్వంసం అయింది. 800 మెట్టు వద్దనున్న కల్వర్టు వరదల్లో కొట్టుకుపోగా..మార్గం మొత్తం బండారాళ్లు, ఇసుక మేటలు ఏర్పడి నడిచేందుకు వీలు లేకుండా పోయింది. నడక మార్గం ద్వారా వచ్చే భక్తులకు దివ్యదర్శనం టికెట్లు ఇచ్చే కౌంటర్లు (Counters) కూడా వరదల ధాటికి కొట్టుకుపోయాయి. దీంతో శ్రీవారి మెట్టు మార్గాన్ని మూసివేసిన టీటీడీ (TTD) అధికారులు, మరమ్మతులు నిర్వహించారు. ఆరు నెలల పాటు మరమ్మతులు నిర్వహించి..శ్రీవారి మెట్టు మార్గాన్ని అందుబాటులోకి తెచ్చింది టీటీడీ. ఈక్రమంలో మే 5 నుంచి నడక మార్గం ద్వారా భక్తులను అనుమతించనున్నారు. అయితే 800వ మెట్టు వద్ద కల్వర్టు పనులు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సరికొత్త హంగులతో గతంలో కంటే మరింత పటిష్టంగా మెట్టు మార్గాన్ని తీర్చిదిద్దింది టీటీడీ.
వరంగల్ ఎన్ఐటీ (NIT Warangal) ప్రొఫెసర్లతో మెట్టు మార్గాన్ని అధ్యయనం చేయించిన అనంతరం వారి సూచనల మేరకు ఎంతో పటిష్టంగా నిర్మాణం చేపట్టారు. మరో వందేళ్లలో ఎంత పెద్ద వరద వచ్చినా మెట్టు మార్గం చెక్కు చెదరకుండా ఉండేలా నిర్మాణం చేపట్టినట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు.
TTD: శ్రీవారి దర్శన టికెట్ల సంఖ్యను పెంచిన టీటీడీ, అదనపు కోటా కింద 13 వేల దర్శన టికెట్లు విడుదల
ప్రస్తుతం అలిపిరి (Alipiri)నడక మార్గం ద్వారానే కొండపైకి వెళుతున్నారు భక్తులు. మెట్టు మార్గం ప్రారంభమైతే భక్తులు ఎక్కువ సంఖ్యలో నడక మార్గం ద్వారా తిరుమలకు చేరుకోవచ్చు. టీటీడీ నిర్ణయంపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.