Amaravati, April 11: ఆపదలో ఉన్న మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ ఎస్‌వోఎస్ యాప్ వినియోగదారుల ప్రశంసలు పొందుతున్నసంగతి విదితమే. మహిళ రక్షణ కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన దిశా యాప్ తాజాగా నాలుగు నిండు ప్రాణాలను (Disha App Saves 4 Lives) నిలిపింది. ఈ యాప్ కర్నూలు జిల్లా మహానంది మండలం, నల్లమల అడవిలో ఆత్మహత్యకు యత్నించిన తల్లీ, ముగ్గురు పిల్లల ప్రాణాలు నిలిపేలా (Disha app saves four lives in Kurnool district) చేసింది.
దిశా యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందడంతో తక్షణమే స్పందించిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నలుగురిని నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లీ, పిల్లలను కాపాడిన పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు యత్నించిన ఆ కుటుంబానికి రూ. 50వేల నగదు సహాయం అందించారు.
ఈ ఘటన వివరాల్లోకెళితే.. నంద్యాల మండలం చాపిరేళ్లుకు చెందిన బోయ ఆది లక్ష్మికి ముగ్గురు ఆడపిల్లు.. భర్త ఏడాది క్రిందట కుందూ నది వాగులో ప్రమాదవశాత్తూ పడి చనిపోయాడు. అప్పటి నుంచి ఆదిలక్ష్మి పిల్లల బాధ్యత తీసుకుంది. పాపం ఆమెకు ఎవరూ అండగా లేకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆదిలక్ష్మి పదో తరగతి వరకు చదువుకోవడంతో మహిళా పోలీస్ కావడానికి కష్టపడుతోంది. ఈ క్రమంలో ఆమెను బంధువులు, స్థానికులు సూటిపోటి మాటల అంటున్నారు.
ఆవేదన గురైన ఆమె.. ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. చాపిరేవుల నుంచి నల్లమల్ల అటవీ ప్రాంతంలోని గాజులపల్లె దగ్గర సర్వ నరసింహస్వామి ఆలయం పరిసర ప్రాంతంలోకి పిల్లలతో పాటు వెళ్లింది.. వెంట సూపర్ వాహిమాల్‌ను తీసుకెళ్లింది. ఆమె వాహిమాల్‌ను ముందుగా తాగింది.. కూల్ డ్రింక్‌లో దాన్ని కలిపి ముగ్గురు పిల్లలకు తాగించేందుకు ప్రయత్నించింది. పిల్లలు చేదుగా ఉందని చెప్పి తాగమని చెప్పి ఏడ్చారు.. ఇద్దరు పిల్లలకు మాత్రం తాగించింది.
బస్సులో ప్రయాణిస్తున్న మహిళ దిశ యాప్ ద్వారా సాయం
కొద్దిసేపటి తర్వాత తల్లి భయపడింది.. పిల్లల ప్రాణాలైనా దక్కుతాయని మొబైల్‌లో దిశా యాప్ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు.. సిగ్నల్స్ ఆధారంగా అటవీప్రాంతంలోకి వెళ్లి ముగ్గుర్ని కాపాడి ఆస్పత్రికి తరలించారు. ముగ్గుర్ని కాపాడిన పోలీసులపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇంటర్నెట్ లేకున్నా యాప్‌ను వినియోగించుకోవచ్చు. తొలుత ఇంటర్నెట్ సాయంతో దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, ఇన్‌స్టాల్ చేసుకుంటే చాలు.. ఆ తర్వాత ఇంటర్నెట్ ఉన్నా లేకున్నా ఫోన్ ద్వారా ఈ యాప్‌ను వినియోగించుకోవచ్చు. ఎస్‌వోఎస్ బటన్ నొక్కడం ద్వారా గానీ, ఫోన్‌ను గట్టిగా అటూ ఇటూ ఊపడం ద్వారా గానీ ఆపదలో ఉన్న మహిళలు దిశ కాల్ సెంటర్‌కు సమాచారం ఇవ్వవచ్చు. ఆ తర్వాత ప్రమాదంలో ఉన్న మహిళలను కాపాడేందుకు దిశ కంట్రోల్ రూమ్ నుంచి పోలీసులకు ఆటోమేటిక్‌గా సమాచారం అందుతుంది.
యాప్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి
*ఆండ్రాయిడ్, ఐవోఎస్ మొబైల్ ఫోనుల్లో ప్లేస్టోర్‌లోకి వెళ్లి దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
*ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడానికి ఇంటర్నెట్ అవసరం ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్నెట్ ఉన్నా, లేకున్నా మొబైల్ ద్వారా ఈ యాప్‌ను ఉపయోగించుకోవచ్చు.
*ఆపదలో ఉన్నవారు ఈ యాప్‌ను ఓపెన్ చేసి అత్యవసర సహాయం(ఎస్‌వోఎస్) బటన్ నొక్కితే చాలు.. వారి ఫోన్ నంబర్, చిరునామా, వారున్న ప్రదేశం వివరాలు దిశ కంట్రోల్ రూమ్‌కు చేరతాయి.
*ఎస్‌వోఎస్ బటన్ ప్రెస్ చేసే సమయం లేనప్పుడు చేతిలోని ఫోన్‌ను గట్టిగా అటూఇటూ ఊపితే చాలు.. దిశ కమాండ్ రూమ్‌కు సమాచారం చేరుతుంది.
*ఎస్‌వోఎస్ బటన్‌ను నొక్కితే వాయిస్‌తోపాటు పది సెకన్ల వీడియోను కూడా రికార్డు చేసి కమాండ్ రూమ్‌కు పంపించే వీలు ఉంది.
*ఎస్‌వోఎస్ బటన్ నొక్కగానే కంట్రోల్ రూమ్‌కు సమాచారం వెళ్లి.. అక్కడి నుంచి వెంటనే సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు, పోలీస్ రక్షక్ వాహనాలకు ఆటోమేటిక్‌గా కాల్ వెళ్తుంది.
*ప్రమాదంలో ఉన్నవారిని చేరుకోవడానికి జీపీఎస్ అమర్చిన పోలీస్ రక్షక్ వాహనాల్లోని ‘మొబైల్ డేటా టెర్మినల్’ సహాయపడుతుంది.
*అలాగే ఆపదలో ఉన్నప్పుడు సమాచారాన్ని పోలీసులతోపాటు తక్షణం కుటుంబ సభ్యులు/మిత్రులకు పంపేలా ఐదు ఫోన్ నంబర్ల (ఎమర్జెన్సీ కాల్స్)ను దిశ యాప్‌లో నమోదు చేసుకోవచ్చు.
*దిశ యాప్‌లోని ‘ట్రాక్ మై ట్రావెల్’ ఆప్షన్ వినియోగిస్తే వారు వెళ్లాల్సిన ప్రాంతాన్ని కూడా నమోదు చేయొచ్చు. ఇలా చేయడం ద్వారా వారు ప్రయాణిస్తున్న వాహనం వెళ్లాల్సిన ప్రాంతానికి కాకుండా దారి మళ్లితే ఆ సమాచారాన్ని కంట్రోల్ రూమ్, బంధుమిత్రులకు పంపి అప్రమత్తం చేయొచ్చు.
*ఈ యాప్‌లోనే డయల్ 100, డయల్ 112 నంబర్లను కూడా పొందుపర్చారు. డయల్ 100 అయితే నేరుగా కాల్ చేసి విషయం చెప్పాలి. డయల్ 112 అయితే మిస్డ్ కాల్ ఇచ్చినా సరిపోతుంది.
*దిశ యాప్‌లో పోలీసు అధికారుల ఫోన్ నంబర్లు, సమీపంలోని పోలీస్‌స్టేషన్ వివరాలు తెలుసుకునేందుకు ఆప్షన్లు ఉంటాయి. వైద్య సేవలు అవసరమైనప్పుడు యాప్ ద్వారా దగ్గర్లోని ఆస్పత్రులు, బ్లడ్ బ్యాంకులు, ఫార్మసీల వివరాలను కూడా తెలుసుకోవచ్చు.