Amaravati, May 22: డాక్టర్ సుధాకర్ కేసులో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. డాక్టర్ సుధాకర్ (Doctor Sudhakar case) వ్యవహారంపై హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును సీబీఐకి (CBI) అప్పగించాలని ఆదేశించింది.. విశాఖ పోలీసులుపై (VIzag Cops) కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ వారాల్లోగా విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని సీబీఐని ఏపీ హైకోర్టు (Andhra Pradesh Highcourt) ఆదేశించింది. ఈ కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించడం ఆసక్తికరంగా మారింది. సుధాకర్ కేసులో దాఖలైన పిటిషన్‌ను కోర్టు శుక్రవారం విచారణ జరపగా విశాఖ జడ్జి ఆయన స్టేట్‌మెంట్‌ను సమర్పించారు.
ఈ నేపథ్యంలో విశాఖ పోలీసులపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని సీబీఐను ఆదేశించింది. 8 వారాల్లోగా విచారణ పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని ఆదేశాల్లో తెలిపింది. సుధాకర్ శరీరంపై గాయాలున్న విషయం మేజిస్ట్రేట్ నివేదికలో ఉందని, ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో గాయాలు ప్రస్తావన లేదని తెలిపింది. ప్రభుత్వ నివేదికపై అనుమానాలు ఉన్నాయని.. అందుకే సీబీఐ విచారణకు ఆదేశించామని కోర్టు చెప్పింది. ట్విస్టులతో సాగుతున్న డాక్టర్ సుధాకర్ ఎపిసోడ్, సుధాకర్ వాగ్మూలాన్ని రికార్డు చేయాలన్న హైకోర్టు, కేసును వెనక్కి తీసుకోవాలన్న ఐఎంఎ, ఆది నుంచి ఏం జరిగింది..?
హైకోర్టు తీర్పుపట్ల డాక్టర్ సుధాకర్ తల్లి హర్షం వ్యక్తం చేశారు. కేసు విచారణను సీబీఐకి బదిలీ చేయడం శుభపరిణామం అన్నారు. న్యాయస్థానంపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు. సీబీఐ విచారణతో తమకు న్యాయం జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ నెల 16న డాక్టర్ సుధాకర్‌ను విశాఖ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సుధాకర్ మానసిక పరిస్థితి సరిగా లేదని కేజీహెచ్ వైద్యులు చెప్పడంతో.. పోలీసులు ప్రభుత్వ మెంటల్ ఆస్పత్రికి తరలించారు. అయితే డాక్టర్ సుధాకర్ విషయంలో విశాఖ పోలీసులు వ్యవహరించిన తీరుపై వీడియోలతో ఏపీ టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత హైకోర్టుకు లేఖ రాశారు. దీంతో కోర్టు ఈ లేఖను సుమోటో పిల్‌గా పరిగణించి విచారణ జరిపింది. అలాగే మరో వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు.
ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఎడిట్ చేసిన వీడియోను హైకోర్టుకు పంపారని ప్రధాని, ముఖ్యమంత్రిని డాక్టర్ దూషించిన వీడియోలను ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఈ విషయంలో ఇప్పటికే ఓ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసినట్లు అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ కోర్టుకు తన వాదనలు వినిపించగా సుధాకర్‌ను కోర్టులో హాజరు పరచాలని ఆదేశించింది.
విశాఖ మెంటల్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నట్లు ప్రభుత్వం కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. దీంతో కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సుధాకర్ చికిత్సపొందుతున్న ఆస్పత్రికి వెళ్లి వాంగ్మూలం నమోదు చేయాలని విశాఖ సెషన్స్ జడ్జిని ఆదేశించింది. గురువారం సాయంత్రంలోగా వాంగ్మూలాన్ని హైకోర్టుకు సమర్పించాలని సూచించింది. ఈ కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. సుధాకర్ స్టేట్మెంట్ పరిశీలించి ఈ కేసును సీబీఐకి అప్పగించింది.