Paper Leak Case: నారాయణ అరెస్ట్‌, లీక్‌ చేసేది వీళ్లే.. గందరగోళం చేసేది వీళ్లేనని తెలిపిన అంబటి రాంబాబు, నారాయణ అరెస్ట్‌లో కక్ష సాధింపు ఏముందని ప్రశ్నించిన రాంచంద్రారెడ్డి, ఇంకా ఎవరేమన్నారంటే..
TDP Leader P Narayana arrested in paper leak case (photo-Video Grab)

Hyd, May 10: టీడీపీ నేత, మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణను ఏపీ సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాదులోని ఆయన నివాసంలో కాసేపటి క్రితం అరెస్ట్ చేశారు. ఆయన సొంత వాహనంలోనే ఏపీకి తరలించారు. ఆయన వెంట ఆయన భార్య రమాదేవి కూడా ఉన్నారు.ఆయన నివాసానికి వెళ్లిన సీఐడీ పోలీసులు అదుపులోకి (TDP Leader P Narayana arrested ) తీసుకున్నారు. ఏపీలో పదో తరగతి పరీక్ష పేపర్లు లీక్ కావడం (Exams Paper Leak Case) వెనుక నారాయణ విద్యాసంస్థలపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. పేపర్ లీక్ చేసింది నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలే అంటూ సీఎం జగన్ నేరుగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మరోవైపు, దీనికి సంబంధించి చిత్తూరులో నారాయణపై కేసు నమోదయింది.

మాజీ మంత్రి నారాయణపై (Former Andhra Pradesh minister) మరో కేసు నమోదైంది. అమరావతి ల్యాండ్‌ పూలింగ్‌ కేసులో అవినీతి అంశానికి సంబంధించి ఏపీ సీఐడీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 2014-19 మధ్య భూసేకరణలో అవకతవకలు జరిగాయంటూ కేసు నమోదు అయ్యింది. దీనిపై సోమవారం(మే9వ తేదీన) ఏపీ సీఐడీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదుతో మంగళగిరి పీఎస్‌లో కేసు నమోదు చేయగా, దీనిపై ఏపీ సీఐడీ (AP CID) ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. మాస్టర్‌ ప్లాన్‌లో ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు డిజైన్‌ మార్చారనే ఫిర్యాదుపై చంద్రబాబు, నారాయణ, లింగమనేని రమేష్‌లపై కేసు నమోదు చేశారు.

ట్విస్టులతో సాగుతున్న నారాయణ అరెస్ట్ ఎపిసోడ్, అమరావతి ల్యాండ్‌ పూలింగ్‌ కేసులో మరో కేసు నమోదు, భగ్గుమంటున్న టీడీపీ నేతలు, ఎవరేమన్నారంటే..

టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి పొంగూరు నారాయ‌ణ‌ను అరెస్ట్ చేసిన వ్య‌వ‌హారంపై (CID Arrest Former Andhra Minister Narayana) చిత్తూరు పోలీసులు స్పందించారు. నారాయ‌ణ‌ను అరెస్ట్ చేసిన మాట వాస్త‌వ‌మేన‌ని తెలిపిన పోలీసులు... హైద‌రాబాద్‌లో మంగ‌ళ‌వారం ఉద‌యం 10.30 గంట‌ల‌కు ఆయ‌న‌ను అరెస్ట్ చేశామ‌ని తెలిపారు. అనంత‌రం ఆయ‌న‌ను చిత్తూరు త‌ర‌లిస్తున్నామ‌ని కూడా తెలిపారు. ఈ సంద‌ర్భంగా నారాయ‌ణ‌పై న‌మోదు చేసిన కేసుల వివ‌రాల‌ను కూడా చిత్తూరు పోలీసులు వెల్ల‌డించారు. ప‌బ్లిక్ ఎగ్జామ్స్ ప్రివెన్ష‌న్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ చ‌ట్టం కింద, ఐపీసీ సెక్ష‌న్లు 408,409, 201,120(బీ),తో పాటు 65 ఐటీ చ‌ట్టం కింద ఆయనపై కేసు న‌మోదు చేశారు. ఇక ప‌బ్లిక్ ఎగ్జామ్ చ‌ట్టంలోని సెక్ష‌న్లు 5, 8, 10 కింద కూడా నారాయ‌ణ‌పై కేసులు న‌మోదు చేశారు. ఇదిలా ఉంటే ఈ సాయంత్రానికి చిత్తూరు త‌ర‌లించ‌నున్న నారాయ‌ణ‌ను అక్కడి జ్యూడీషియ‌ల్ కోర్టులో హాజ‌రుప‌రుస్తామ‌ని చెప్పారు.

ఏపీలో టెన్త్‌ ప్రశ్నాపత్రాల లీకేజ్‌ వ్యవహారంలో మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణను దర్యాప్తులో భాగంగానే ఏపీ సీఐడీ అరెస్ట్‌ చేసిందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. నారాయణ స్కూల్‌ సిబ్బందే టెన్త్‌ పేపర్లు బయటకు పంపారని బొత్స తెలిపారు. టెన్త్‌ పేపర్‌ లీక్‌ కేసులో ఇప్పటివరకూ 60 మందిని అరెస్ట్‌ చేశారన్నారు. రాజకీయ విమర్శలు ఆపి, తప్పు చేయలేదని ధైర్యంగా చెప్పాలన్నారు బొత్స. కాగా, టెన్త్‌ పేపర్‌ లీకేజీ కేసులో నారాయణను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. ఈ మేరకు ఐపీసీ 408, పబ్లిక్‌ పరీక్షల మాల్‌ ప్రాక్టీస్‌ నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

టెన్త్‌ పేపర్‌ లీకేజ్‌ వ్యవహారం, టీడీపీ నేత, నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణ అరెస్ట్, ఇప్పటికే వైస్‌ ప్రిన్సిపల్‌ గిరిధర్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్‌ చేసిన సీఐడీ పోలీసులు

మొత్తం నారాయణ విద్యాసంస్థల్లోనే ఈ ప్రశ్న పత్రాల మాల్ ప్రాక్టీస్ జరిగిందని పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి అన్నారు. ఇప్పటికే ప్రశ్న పత్రాలు మాల్ ప్రాక్టీస్ కేసులో 60 మందిని అరెస్ట్ చేసినట్లు ఆయన గుర్తు చేశారు. అందులో పూర్తి విచారణ జరిగాకే.. ఇప్పుడు నారాయణను అరెస్ట్ చేశారన్నారు మంత్రి పెద్దిరెడ్డి. ఇందులో ఎలాంటి కక్ష సాధింపు లేదు. విచారణలోనే అంతా తేలింది. వాస్తవాల ఆధారంగానే పోలీసులు అరెస్ట్ చేశారు’ అని స్పష్టం చేశారు. ఇక పొత్తులపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేస్తున్న ప్రకటనలపైనా మంత్రి పెద్దిరెడ్డి స్పందించారు. చంద్రబాబుకి మతిమరుపు వచ్చి రోజుకో మాట మాట్లాడుతున్నాడు. పొత్తులపై మాట్లాడింది ఆయనే, మాట మార్చింది ఆయనే. చంద్రబాబుకి జనం ఎలాగూ తనను గెలిపించరని తెలుసు. అందుకే పొత్తుల కోసం రోజు మాట్లాడుతారు. వైఎస్సార్‌సీపీ మాత్రం ఒంటరిగా పోటీ చేసి మళ్ళీ గెలిచి తీరుతుంద’’ని ధీమా వ్యక్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి.

ఏపీలో టెన్త్‌ ప్రశ్నాపత్రాల లీకేజ్‌ వ్యవహారంలో మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణ ఉన్నాడని ప్రాథమిక ఆధారాలు ఉన్న తర్వాతే ఏపీ సీఐడీ అరెస్ట్‌ చేసిందని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. నారాయణ అరెస్ట్‌పై టీడీపీ చేస్తున్న రాద్దాంతాన్ని అంబటి రాంబాబు తీవ్రంగా ఖండించారు.‘లీక్ చేసేది వీళ్లే.. గందరగోళం చేసేది వీళ్లే. రాష్ట్రంలో జరిగే చాలా విషయాల్లో ఇలానే చేస్తున్నారు. వాళ్లేమో లీక్ చేయొచ్చు...యాక్షన్ మాత్రం తీసుకోవద్దా...?, నిర్వహణ లోపం ఏమిటి..? నారాయణ స్కూల్ కి పరీక్షా పత్రం ఇవ్వొద్దంటారా..?, మీకు నెంబర్ వన్ ఎలా వస్తుంది..? ఇలాంటి లీక్‌ల వల్ల నంబర్‌వన్‌ ర్యాంక్‌ వస్తుంది. విచారణ తర్వాతే నారాయణను అదుపులోకి తీసుకున్నారు. నారాయణ కాలేజీ ప్రిన్సిపల్‌ స్టేట్‌మెంట్‌ తర్వాతే విషయం బయటకొచ్చింది.

పేపర్లు లీక్‌ చేసి డబ్బు సంపాదించుకుంటున్నారు.పేపర్‌ లీకేజీల వల్లే నారాయణ విద్యాసంస్థలకు నంబర్‌వన్‌ స్థానం. పేపర్‌ లీక్‌ వ్యవహారంలో నారాయణ ఉన్నారని ప్రాథమికంగా నిర్థారించారు. వాళ్లేమో లీక్‌ చేయొచ్చు.. యాక్షన్‌ మాత్రం తీసుకోవద్దా?, నారాయణను అరెస్ట్ చేయాలని మాకేంటి...?, ఈ స్కాంలో నారాయణ ఉన్నాడని ప్రాథమిక ఆధారాలతోనే అరెస్ట్ చేశారు. జనం మాత్రం జరుగుతున్న వాస్తవాలు చూస్తూనే ఉన్నారు. పేపర్ లీక్ చేసేది మీరు.. రాజీనామా చేయాల్సింది బొత్స సత్యనారాయణా..?’ అని ప్రశ్నించారు మంత్రి అంబటి రాంబాబు.

అమరావతి ల్యాండ్ పూలింగ్ లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో ఏపీ సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును ఏ1గా, నారాయణను ఏ2గా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఈ కేసులో ఏ1గా ఉన్న చంద్రబాబుకు కూడా నోటీసులు ఇస్తారని చెప్పారు. తప్పు చేస్తే అరెస్టులు చేస్తారని... చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. అరెస్టుల వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని చెప్పారు. నారాయణ అరెస్ట్ పై స్పందిస్తూ... ర్యాంకుల కోసం నారాయణ దుర్మార్గంగా వ్యవహరించారని ఆరోపించారు. నారాయణ మంత్రిగా ఉన్నప్పుడు పేపర్ లీక్ జరిగిందో, లేదో తనకు తెలియదని చెప్పారు.

టెన్త్ ప్ర‌శ్నాప‌త్రాల లీకేజీ వ్య‌వ‌హారంలో టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి పొంగూరు నారాయ‌ణ అరెస్ట్‌ కావడంపై వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఏపీ ప్ర‌భుత్వ ముఖ్య స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి తాజాగా స్పందించారు. అధికారుల‌కు స్వేచ్ఛ ఇవ్వ‌డం వ‌ల్ల‌నే నారాయ‌ణ దొరికిపోయార‌న్న స‌జ్జ‌ల‌.. రికార్డుల పేరుతో నారాయ‌ణ త‌ప్పుడు విధానాల‌కు పాల్ప‌డ్డార‌ని వ్యాఖ్యానించారు. కాపీయింగ్‌ను ఆర్గ‌నైజ్డ్ క్రైమ్‌ (వ్యవస్థీకృత నేరం)గా నారాయ‌ణ చేయించారన్న ఆయ‌న‌... ఇలాంటి త‌ప్పుడు విధానాన్ని గ‌త ప్ర‌భుత్వం ప్రోత్స‌హించిందని ఆరోపించారు. ప్ర‌స్తుత‌ ప్ర‌భుత్వం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో త‌ప్పు బ‌య‌ట‌ప‌డిందని స‌జ్జ‌ల చెప్పారు. చ‌ట్టం ఎవ‌రి విష‌యంలో అయినా స‌మానంగా ప‌ని చేస్తుందని, ప్ర‌భుత్వం దృష్టిలో ఎవ‌రైనా ఒక‌టేన‌ని తెలిపారు. త‌ప్పు చేశార‌ని తెలియ‌డం వ‌ల్లే వైఎస్ కొండారెడ్డిని అరెస్ట్ చేశారంటూ స‌జ్జ‌ల వ్యాఖ్యానించారు.