
Vjy, Feb 25: సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసిన కేసులో వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈరోజుతో ఆయన రిమాండ్ ముగుస్తున్న నేపథ్యంలో... విజయవాడ జైలు నుంచి వంశీని వర్చువల్ గా మేజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరు పరిచారు. వంశీ రిమాండ్ ను పొడిగించాలని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టును పోలీసులు కోరారు. ఈ క్రమంలో వంశీ రిమాండ్ ను కోర్టు మరో 14 రోజుల పాటు అంటే మార్చి 11 వరకు పొడిగించింది.
మరోవైపు, ఇదే కేసులో వల్లభనేని వంశీని విచారణ కోసం పటమట పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. మూడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. విచారణ సమయంలో నాలుగు సార్లు వంశీని ఆయన న్యాయవాది కలిసేందుకు కోర్టు అనుమతించింది. విజయవాడ పరిధిలోనే విచారణ జరపాలని షరతు విధించింది. ప్రస్తుతం వంశీని ఆరోగ్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తీసుకువెళుతున్నారు. అనంతరం ఆయన విచారణ ప్రారంభమవుతుంది.