Amaravati, August 30: మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను దెందులూరు పోలీసులు అరెస్టు (Chintamaneni Prabhakar Arrest) చేశారు. కొయ్యూరు మండలం మర్రిపాలెం చెక్‌పోస్ట్ వద్ద ప్రభాకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన ప్రభాకర్‌ను (Former TDP MLA Chintamaneni Prabhakar) పోలీసులు అరెస్టు చేసి ఏలూరుకు తరలించారు. కాగా నిన్న దెందులూరులో పెట్రోల్ ధరలపై చింతమనేని ఆందోళన చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకుగాను దెందులూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అరెస్టు చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) మండిపడ్డారు. పోలీసుల తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు లేఖ రాస్తూ, తమ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు సరికాదని చెప్పారు. చింతమనేని ప్రభాకర్‌ను అక్రమంగా అరెస్టు చేయడం హేయమైన చర్య అని, ధరల పెంపుపై ప్రభాకర్ నిరసన వ్యక్తం చేసి, దెందులూరు తహసీల్దార్‌కు వినతి పత్రమిస్తే తప్పుడు కేసులు పెడతారా? అని చంద్రబాబు నిలదీశారు.
చింతమనేని విశాఖలో వివాహ వేడుకకు హాజరైతే ఆయనను అరెస్టు చేశారని విమర్శించారు. ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే అందులో తప్పేముందని చంద్రబాబు ప్రశ్నించారు. ఇలా అక్రమ నిర్బంధాలు, అరెస్టులు చేస్తూ పోవడం మంచిది కాదని, ఏపీలో ప్రతిపక్ష నాయకులను బెదిరించే ప్రయత్నాలు తగదని పేర్కొన్నారు. పోలీసులు ఇలా అక్రమంగా అరెస్టు చేస్తూ ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్నారని ఆయన అన్నారు.
వైసీపీ ప్రేరేపిత పోలీస్ రాజ్ కనిపిస్తోందని, సర్కారుకి వ్యతిరేకంగా మాట్లాడితే వేధిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకులను చట్టవిరుద్ధంగా నిర్బంధిస్తూ రాష్ట్రంలో ప్రజాస్వామ్య హక్కులను కాలరాసేలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. తమ నేతలపై తప్పుడు కేసులు పెట్టడంపైనే పోలీసులు దృష్టి పెట్టారని ఆయన తెలిపారు. ఏపీలో ప్రతిదినం హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయని, ప్రజలు నిరంతరం భయం, అభద్రతతో జీవిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే చర్యలను మానుకోవాలని, తమ నేతలపై తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.