Kurnool, June 23: కర్నూలు నగరంలోని వన్‌టౌన్ ఏరియాలో విషాదం చోటుచేసుకుంది. విషం తాగి ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. కుటుంబంలోని నలుగురు మృత్యుఒడిలోకి (Four of family die by suicide in Kurnool) చేరుకున్నారు. మృతులలో దంపతులు ప్రతాప్, హేమలత వారి పిల్లలు జయంత్, రిషిత ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టీవీ మెకానిక్ ప్రతాప్(42), హేమలత(36) దంపతులు తమ పిల్లలు జయంత్(17), రిషిత(14)తో కలిసి వడ్డెగేరిలో నివాసం ఉంటున్నారు. బుధవారం ఉదయం తలుపులు ఎంతకీ తెరవకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు తలుపులు పగులగొట్టి లోపలికెళ్లి చూడగా నలుగురూ విగతజీవులై కనిపించారు. ఘటనాస్థలి వద్ద పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కరోనా కారణంగా బంధువులు, స్నేహితులు చనిపోయారన్న మనస్తాపంతో విషం తాగి బలవన్మరణానికి పాల్పడినట్లు సూసైడ్‌నోట్‌లో వారు వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
విషాదమైన చిన్నారుల అదృశ్యం: కృష్ణా జిల్లా అగిరిపల్లి మండలంలో ముగ్గురు చిన్నారుల అదృశ్యం విషాదాంతమైంది. మండలంలోని ఈదర సగరపేటలో చెరువులో పడి ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఆడుకునేందుకు నిన్న చెరువు వద్దకు వెళ్లిన జగదీశ్ (8), చంద్రిక (9), శశిత (11) కనిపించకుండా పోయారు. ఎంత వెతికినా చిన్నారులు కనిపించకపోవడంతో వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చేపట్టారు. ఈదరకు సమీపంలోని శోభనాపురం చెరువులో ముగ్గురు చిన్నారుల మృతదేహాలను ఇవాళ పోలీసులు గుర్తించారు. చిన్నారుల మృతితో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.