Amaravati, Nov 12: పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రానున్న నాలుగైదు గంటలు పలు ప్రాంతాలలో భారీ వర్షాలు (Heavy Rain Alert in AP) కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. ఐఎండి (IMD)వాతావరణ సూచనల ప్రకారం ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.
అలాగే విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని…కావున ప్రజలు అలర్ట్‌గా ఉండాలని విపత్తుల శాఖ కమిషనర్ కె. కన్నబాబు సూచించారు. భారీ వర్షాలు (heavy rain forecast) కురిసే అవకాశాలున్న నేపథ్యంలో అధికారులు కూడా అలెర్టయ్యారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విపత్తులశాఖ కమిషనర్ కన్నబాబు సూచించారు.
శ్రీకాకుళం, నెల్లూరు విజయనగరం జిల్లాల్లో బుధవారం ఎడతెరిపి లేని వర్షం పడింది. దీంతో ప్రధాన పట్టణాలు, మండల కేంద్రాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శ్రీకాకుళం నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంగణంలోకి భారీగా వరద నీరు చేరింది. ఎచ్చెర్ల, రణస్థలం, పోలాకి, నరసన్నపేట, సోంపేట, పలాస, వజ్రపుకొత్తూరు, శ్రీకాకుళం రూరల్, మందస మండలాల్లో కొద్దిపాటి గాలులు వీచాయి. దీంతో రైతులు ఆందోళనకు గురయ్యారు.
కాగా వంశధార, నాగావళి నదీ పరీవాహక ప్రాంతాల్లో ప్రస్తుతం కోతలు ప్రారంభమయ్యాయి. కొన్నిచోట్ల కోతకు సన్నద్ధమవుతుండగా వర్షం పడడంతో రైతులకు నష్టం కలిగింది. ఇప్పటికే కోసిన వరి పనలు పొలాల్లో ఉండడంతో తడిసిపోయాయి. వర్షం తెరిపినివ్వకుంటే ఎక్కువగా నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. గార మండలం కళింగపట్నంలో అత్యధికంగా 39.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
అల్పపీడన ప్రభావంతో గురువారం కూడా వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక నెల్లూరు జిల్లాలో చాలా చోట్ల మెట్ట పైరు మినుము పూత దశకు వచ్చింది. వర్షాలు ఇలాగే కొనసాగితే మినుము పక్కకు వాలిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన పడుతున్నారు. ఇక విజయనగరం, ఇంకా కొన్ని జిల్లాల్లో వరి చేల కోతలు మొదలైన దశలో కురుస్తున్న అకాల వర్షాలు అన్నదాతలను కలవర పరుస్తున్నాయి.తాజా వర్షాలకు కొన్నిచోట్ల కోత కోసి పెట్టిన పనలు తడిసిపోయాయి.