HIGH COURT OF ANDHRA PRADESH| (Photo-Twitter)

Amaravati, Mar 3: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌కు ఏపీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. మున్సిపల్‌ ఎన్నికల్లో (AP Municipal Polls) రీ నామినేషన్‌కు అవకాశం ఇస్తూ జారీ చేసిన ఆదేశాలను బుధవారం హైకోర్టు (AP High Court) కొట్టివేసింది. కొత్తగా మున్సిపల్‌ నామినేషన్లకు అవకాశం ఇవ్వొద్దని స్పష్టం చేసింది. మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి వార్డు వాలంటీర్లపై ఎస్‌ఈసీ (SEC) జారీ చేసిన ఆదేశాలను కూడా కొట్టేసింది. వాలంటీర్ల ట్యాబ్‌లను స్వాధీనం చేసుకోవద్దని సూచించింది.

కాగా, తిరుపతి కార్పోరేషన్‌లో ఆరు, పుంగనూరు మున్సిపాలిటీలో మూడు, కడప జిల్లా రాయచోటిలో రెండు ఏకగ్రీవాలలో రీ నామినేషన్‌కు అవకాశం కల్పిస్తూ ఎస్‌ఈసీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నామినేషన్ వేయకుండా అడ్డుకుని బలవంతంగా ఏకగ్రీవం చేయించుకున్నందునే రీ నామినేషన్‌కి అవకాశమిస్తున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు. అంతేకాదు..వార్డు వాలంటీర్లను మున్సిపల్‌ ఎన్నికల విధుల నుంచి దూరంగా ఉంచాలంటూ ఆదేశాలు జారీ చేశారు. వారి ఫోన్లను స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను ఏపీ హైకోర్టు కొట్టి వేసింది.

మళ్లీ వైసీపీదే హవా..మునిసిపల్ ఎన్నికల్లో ఏకగ్రీవాల జోరు, మొత్తం 245 డివిజన్, వార్డు స్థానాల్లో సింగిల్ నామినేషన్లు దాఖలు, మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఎస్ఈసీ అధికారికంగా ప్రకటించే అవకాశం

ఎన్నికలు జరగని పంచాయతీలు, వార్డులకు కొత్త నోటిఫికేషన్‌ విడుదలైంది. సాంకేతిక కారణాలు, నామినేషన్లు దాఖలు కాని 12 పంచాయతీలు, 725 వార్డులకు బుధవారం ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ జారీచేసింది. వార్డులు, గ్రామాల వారీగా ఈనెల 4వ తేదీ నాటికి ఓటర్ల జాబితా ప్రదర్శన జరగనుంది.

6వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లకు గడువు.. 7వ తేదీ ఉదయం 8 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన.. 8వ తేదీ సా.5 గంటల వరకు నామినేష‌న్లపై ఫిర్యాదుల స్వీకరణ..9వ తేదీ నామినేషన్లపై వచ్చిన అప్పీల్ పరిశీలన.. 10 వ తేదీ మ.3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ.. అదే రోజు సాయంత్రం 4 గంటలకి అభ్యర్ధుల తుది జాబితా విడుదల కానుంది. 13వ తేదీ రాత్రి 7.30 గంటలతో అభ్యర్ధుల ప్రచారం ముగియనుంది. 15వ తేదీ ఉ.6.30 నుంచి మ.3.30 గంటల వరకు పోలింగ్.. సాయంత్ర 4 గంటలనుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.

కాగా పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓట్ల లెక్కింపులో ఎక్కడెక్కడ రీ కౌంటింగ్‌ జరిగింది? ఎందుకు నిర్వహించారు? తదితర అంశాలపై తనకు పూర్తి వివరాలు తెలియజేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ మంగళవారం పంచాయతీరాజ్‌ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఎన్నికలు జరిగిన ప్రతి చోట కౌంటింగ్‌ ప్రక్రియపై పూర్తి వివరాలతో పంచాయతీలవారీగా నివేదికలు అందజేయాలని కూడా ఆయన ఇప్పటికే ఆదేశించినట్లు పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు వెల్లడించారు.

ఓట్ల లెక్కింపు ఎన్ని గంటలకు మొదలైంది..? లెక్కింపు సమయంలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడిందా? కరెంటు సరఫరా ఎందుకు నిలిచిపోయింది? కౌంటింగ్‌ పూర్తయ్యాక ఓడిపోయిన అభ్యర్ధి ఏజెంట్ల నుంచి సంతకాలు తీసుకున్నారా? తదితర వివరాలు పంచాయతీల వారీగా స్పష్టంగా ఉండాలని పేర్కొంటూ నిర్ణీత ఫార్మాట్‌ను నిమ్మగడ్డ తాజాగా పంచాయతీరాజ్‌ శాఖకు పంపారు. ప్రతి పంచాయతీకి సంబంధించిన నివేదికలను ఈనెల 5లోగా పంపాలని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే ఏపీ మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో నామినేష‌న్ల బ‌ల‌వంత‌పు ఉప‌సంహ‌ర‌ణ‌ల‌పై రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. బ‌ల‌వంత‌పు ఉప‌సంహ‌ర‌ణ‌ల‌పై పార్టీల నుంచి ఫిర్యాదులు వ‌చ్చాయ‌ని ఎస్ఈసీ తెలిపింది. బల‌వంత‌పు ఉప‌సంహ‌ర‌ణ‌ల‌ను అంగీక‌రించ‌వ‌ద్ద‌ని త‌మ అధికారుల‌కు స్ప‌ష్టం చేసింది.

నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ నోటీసుల‌ను యాంత్రింకంగా, మూడో ప‌క్షం నుంచి వాటిని అంగీక‌రించ‌వ‌ద్ద‌ని స్ప‌ష్టం చేసింది. అలాగే, ఉప‌సంహ‌ర‌ణ ప్ర‌క్రియ స‌మ‌యంలో వీడియోల‌ను తీయాల‌ని ఆదేశించింది. మ‌రోవైపు, ఎన్నిక‌ల్లో అక్ర‌మాల‌కు పాల్ప‌డిన వారిపై క‌ఠిన చ‌ర్య‌ల‌కు ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేర‌కు క‌లెక్ట‌ర్లు, ఎన్నిక‌ల అధికారులు అందుకు త‌గ్గ చ‌ర్య‌లు తీసుకోవాలని పేర్కొంది.