Tadipatri, Dec 24: తాడిపత్రిలో హై టెన్సన్ (Hi Tension In Tadipatri) నెలకొంది. టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వర్గీయులు (JC Diwakar Reddy Followers) వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డీ వర్గీయులు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. సోషల్ మీడియా వేదికగా వైసీపీ నేత కేతిరెడ్డిపై (Kethireddy Pedda Reddy) జేసీ వర్గీయులు తప్పుడు ప్రచారం చేస్తుంటడం ఘటనకు కారణంగా తెలుస్తోంది.
దీనిపై ఎమ్మెల్యే పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసి.. తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి వివరణ ఇచ్చినా తీరు మార్చుకోలేదనే వార్తలు వస్తున్నాయి. ఎమ్మెల్యేను కించపరిచే విధంగా పోస్టులు పెడుతుండటంతో దీనిపై వివరణ కోరేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డి గురువారం నేరుగా జేసీ దివాకర్ రెడ్డి నివాసానికి వెళ్లినట్లుగా తెలుస్తోంది.
ఈ సమయంలో జేసీ సోదరులు ఇద్దరూ అందుబాటులో లేకపోవడంతో తిరిగి ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలోనే అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న జేసీ వర్గీయులు ఎమ్మెల్యేపై దాడికి యత్నించినట్లు సమాచారం. దీంతో వైసీపీ వర్గీయులు కూడా దాడికి దిగినట్లుగా తెలుస్తోంది.. రాళ్ల దాడితో పలు వాహనాల అద్దాలు ధ్వంసం అయ్యాయి. సామాజిక మాధ్యమాల్లో కిరణ్ అనే వ్యక్తి వైసీపీ ఎమ్మెల్యేపై అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అతనిపై కూడా దాడి జరిగినట్లు తెలుస్తోంది.
విషయం తెలుసుకున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్‌రెడ్డి తాడిపత్రికి చేరుకున్నారు. పోలీసులు కూడా జేసీ ఇంటికి చేరుకున్నారు. ఇరు వర్గాలను చెదరగొట్టారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా భారీగా పోలీసులు మోహరించారు.తాజా ఘటనతో తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.