Amaravati, Jan 1: ఆంధ్రప్రదేశ్ నూతన సీఎస్‌గా ఆదిత్యనాథ్ దాస్ గురువారం బాధ్యతలు చేపట్టారు. గురువారం సచివాలయం మొదటి బ్లాకులోని కార్యాలయంలో నీలం సాహ్ని నుంచి సీఎస్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అంతర్ రాష్ట్ర బదిలీలకు సంబంధించిన దస్త్రంపై ఆదిత్యనాథ్‌దాస్ (Aditya Nath Das) తొలి సంతకం చేశారు. ఇక నీలం సాహ్ని ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమితులయిన సంగతి తెలిసిందే. ఏపీ చీఫ్ సెక్రటరీ అదిత్యానాథ్ దాస్, పదవీ విరమణ చేసిన మాజీ సీఎస్ నీలం సాహ్ని ఇద్దరూ.. గవర్నర్ రు కలిసిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా కొత్త సీఎస్ (Chief Secretary of Andhra Pradesh) మాట్లాడుతూ తనకు ఛీప్ సెక్రటరీగా అవకాశం కల్పించినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుని పనిచేస్తానని చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారని, ఆయన లక్ష్యం మేరకు పోలవరం పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అన్ని ఇబ్బందులను అధిగమించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని, ప్రతి సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు అధికారులంతా పనిచేస్తామని సీఎస్ ఆదిత్యనాథ దాస్ తెలిపారు.
దేశంలోనే ఉత్తమ అధికారులుగా ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న గుర్తింపును నిలబెట్టుకునేలా అధికార యంత్రాంగం తోడ్పాటు అందించాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత పురోగమించేలా కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నూతన బాధ్యతలు స్వీకరించిన ఆదిత్యనాథ్ దాస్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని మెరుగైన సేవలు అందించారని ఆదిత్యనాథ్‌దాస్ పేర్కొన్నారు. సాహ్ని పదవీ విరమణ సందర్భంగా నిర్వహించిన వీడ్కోలు సభలో ఆయన మాట్లాడారు. ఆమె ఏ పదవిలో ఉన్నా ఎంతో నిబద్ధతతో పని చేశారన్నారు. అనంతరం సాహ్నిని ఆదిత్యనాథ్‌దాస్ సత్కరించారు.
ఇక నీలం సాహ్ని(Nilam Sawhney) మాట్లాడుతూ.. టెక్కలిలో 36 ఏళ్ల క్రితం సబ్ కలెక్టర్‌గా సర్వీసులో చేరిన తాను వివిధ హోదాల్లో పనిచేసి సీఎస్‌గా పదవీ విరమణ చేయడం సంతృప్తి కలిగిస్తోందని నీలం సాహ్ని చెప్పారు. ముఖ్యంగా అద్భుతమైన ఏపీలో పని చేయడం సంతోషంగా ఉందన్నారు. సీఎం జగన్ అందించిన సహాయ సహకారాలకు సర్వదా కృతజ్ఞురాలినని పేర్కొన్నారు. కరోనా కట్టడిలో సీఎం ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించడంలో తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఆదిత్యనాథ్‌కు అధికారులు ప్రవీణ్ ప్రకాశ్, శశిభూషణ్, కృష్ణబాబు, రావత్, ఉదయలక్ష్మి, టి.విజయకుమార్‌రెడ్డి, ముఖేష్‌కుమార్ మీనా, ప్రవీణ్‌కుమార్, విజయకృష్ణన్ శుభాకాంక్షలు తెలిపారు.