Lokesh Nara meets Microsoft CEO Satya Nadella (photo-PTI)

Vjy, Oct 30: ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ యూఎస్ పర్యటనలో మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల, యాపిల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (ఆపరేషన్స్‌) ప్రియా బాలసుబ్రహ్మణ్యం, అడోబ్‌ సీఈఓ శంతను నారాయణ్‌లతో వేర్వేరుగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో కల్పిస్తున్న అవకాశాలు, ప్రోత్సాహకాలు, రాయితీలు, మౌలిక సదుపాయాల గురించి మంత్రి వారికి వివరించారు. ఈ సందర్భంగా ఏపీకి వచ్చి పెట్టుబడులు పెట్టాలని కోరారు. దానికి వారు సానుకూలంగా స్పందించినట్లుగా సమాచారం.

అమరావతిని కృత్రిమ మేధ (ఏఐ) రాజధానిగా చేయడమే తమ లక్ష్యమని విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. రాజధాని అమరావతిలో ఏఐ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. ఏపీలో డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్, ఏఐ రంగాల అభివృద్ధికి సహకరిస్తామని సత్య నాదెళ్ల హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసే అంశాన్ని పరిశీలిస్తామని ప్రియా సుబ్రహ్మణ్యం, శంతను నారాయణ్‌ చెప్పారని టీడీపీ తెలిపింది.

స్వర్ణాంధ్ర ప్రదేశ్ విజన్ సాకారం, ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన అదానీ గ్రూప్ సంస్థల అధినేతలు

రెడ్‌మండ్‌లో మైక్రోసాఫ్ట్‌ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన సందర్భంగా మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ.. ‘క్లౌడ్‌ ఆధారిత ప్లాట్‌ఫాంల అమలు, డేటా ఎనలిటిక్స్‌కి ఏఐ వినియోగం, సైబర్‌ సెక్యూరిటీ మెరుగుపరచడం, స్మార్ట్‌సిటీ కార్యక్రమాల్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్రప్రభుత్వం అనుసరిస్తున్న డిజిటల్‌ గవర్నెన్స్‌ విధానాలకు సహకరించాలి. ఏపీని సాంకేతికత రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దడంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఐటీ హబ్‌లు, ఇన్నోవేషన్‌ పార్కులను నిర్మిస్తున్నాం. ఇందుకు మైక్రోసాఫ్ట్‌ సహకారం అవసరం. క్లౌడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్ల ఏర్పాటుతో ఏపీ ప్రపంచస్థాయి సంస్థలకు ప్రాంతీయ కేంద్రంగా మారుతుంది’ అని తెలిపారు.