Amaravati, April 19: జగనన్న విద్యాదీవెన పథకం కింద 2020–21 కు సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్ మొదటి విడత నగదును రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. వివిధ విద్యాసంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను జగనన్న విద్యాదీవెన (Jagananna Vidya Deevena 2021) కింద ప్రతి విద్యా సంవత్సరంలో నాలుగు విడతలుగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాలను విద్యార్థుల తల్లుల ఖాతాల్లోనే జమ చేయాలని ప్రభుత్వం (AP Govt) నిర్ణయించింది. సీఎం వైఎస్ జగన్ (CM YS Jagan)సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ఆన్‌లైన్ ద్వారా అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో కంప్యూటర్ బటన్ నొక్కడం ద్వారా జమ చేశారు. రెండో విడత జగనన్న విద్యాదీవెన ఈ ఏడాది జూలైలో, మూడో విడత ఈ ఏడాది డిసెంబర్‌లో, నాలుగో విడత నిధులను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చెల్లించనున్నారు.
మొదటి విడత కింద 10,88,439 మంది విద్యార్థులకు సంబంధించిన రూ.671.45 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను (Jagananna Vidya Deevena Scheme 2021) వారి తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు. ఇందుకోసం ఆర్థిక శాఖతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖలు రూ.671.45 కోట్లను విడుదల చేస్తూ ఆదివారం జీవోలు జారీ చేశాయి.
Audimulapu Suresh Tweet
Hon'ble Chief Minister release of Vidhya Deevena Scheme amounts to mothers accounts.#AudimulapuSuresh #AudimulapuVishal #EducationMinister #Yerragondapalem #AndhraPradesh #VidhyaDeevena pic.twitter.com/xrBfeIYYoO
— Audimulapu Suresh (@AudimulapSuresh) April 19, 2021
బీసీ సంక్షేమ శాఖ రూ.491.42 కోట్లను జగనన్న విద్యాదీవెన మొదటి విడత కోసం విడుదల చేసింది. ఇందులో బీసీ విద్యార్థులతో పాటు ఈబీసీ, కాపు విద్యార్థులు ఉన్నారు. ఎస్సీ విద్యార్థుల కోసం ఎస్సీ సంక్షేమ శాఖ రూ. 119.25 కోట్లు, ఎస్టీ విద్యార్థుల కోసం ఎస్టీ సంక్షేమ శాఖ రూ.19.10 కోట్లు, మైనారిటీ సంక్షేమ శాఖ రూ.41.68 కోట్లు విడుదల చేసింది.
గత టీడీపీ ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకుండా బకాయి పెట్టిన రూ.1,880 కోట్లను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చెల్లించారు. దీంతోపాటు ఇప్పటి వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ.4,207.85 కోట్ల మేర విద్యార్థులకు లబ్ధి కలిగింది. సోమవారం చెల్లించే ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో కలుపుకుంటే మొత్తం రూ.4,879.30 కోట్లను విద్యార్థుల పెద్ద చదువులకు ప్రభుత్వం వ్యయం చేసినట్లువుతుంది. ఇదిలా ఉంటే తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ అయిన వారం, పది రోజుల్లో కాలేజీలకు వెళ్లి ఫీజు చెల్లించాలి. ప్రభుత్వం విడుదల చేసిన ఫీజును కాలేజీలకు చెల్లించకపోతే తదుపరి విడత ఫీజు చెల్లింపు నిలుపుదల చేస్తారు.