Vjy, Jan 26: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (Andhra Pradesh Elections 2024) జనసేన పోటీ చేసే 2 స్థానాలను ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ ప్రకటించారు. టీడీపీ 2 సీట్లు ప్రకటించినందున తాము కూడా 2 స్థానాలను ప్రకటిస్తున్నట్లు చెప్పారు. రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందన్నారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో జాతీయ పతాకాన్ని పవన్ ఆవిష్కరించారు.
అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ని స్థానాలు తీసుకోవాలో తనకు తెలుసని... అది తెలియకుండానే ఇక్కడ వరకు వచ్చానా? అని ప్రశ్నించారు. కొందరు 50 తీసుకోండి, 60 తీసుకోండి అంటున్నారని... పొత్తును ఇబ్బంది పెట్టేలా కొందరు మాట్లాడుతున్నారని పవన్ అన్నారు. ఇది మంచిది కాదని హితవు పలికారు. సీట్ల విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. మనం మూడో వంతు సీట్లను తీసుకోబోతున్నామని చెప్పారు. సీట్ల విషయంలో చంద్రబాబుపై ఒత్తిడి ఉంటుందని, అలాగే తనపై కూడా ఒత్తిడి ఉందని అన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో తాను రెండు సీట్లను ప్రకటిస్తున్నానని... రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని చెప్పారు. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని భావిస్తున్నానని అన్నారు.
సీఎం పదవి కోసం ఎవరూ ఆందోళన చెందొద్దని పవన్ చెప్పారు. జనసేన ఒంటరిగా పోటీ చేస్తే సీట్లు వస్తాయి కానీ, అధికారంలోకి రాలేమని అన్నారు. ఈ ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వాన్ని జనసేన ఎంతో ఇరుకున పెట్టిందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలతో టీడీపీతో పొత్తు ముగియదని, భవిష్యత్తులో కూడా పొత్తు కొనసాగుతుందని తెలిపారు. ఇదే సమయంలో సీఎం జగన్ పై పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సొంత చెల్లెలినే వదిలిపెట్టని జగన్... మనల్ని మాత్రం వదులుతాడా? అని ప్రశ్నించారు. జగన్ కు ఊరంతా శత్రువులే అని చెప్పారు. వైసీపీ నేతలకు కష్టాలు వస్తే తన వద్దకే రావాలని అన్నారు.
సీఎం అభ్యర్థి చంద్రబాబే అని లోకేశ్ మాట్లాడిన మాటలను తాను పట్టించుకోలేదని పవన్ చెప్పారు. చంద్రబాబు సీనియర్ నేత అని, ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అని... అందుకే ఇలాంటివి జరుగుతుంటాయని అన్నారు. ఆ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. 2024లో వైసీపీ ప్రభుత్వం రాకూడదని అన్నారు. జగన్ పై తనకు వ్యక్తిగత కక్ష లేదని చెప్పారు.
కాగా జనసేనతో పొత్తు ఉన్నప్పటికీ.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట అభ్యర్థిగా వేగుళ్ల జోగేశ్వరరావు పేరును చంద్రబాబు ఏకపక్షంగా ప్రకటించారు. అలాగే అరకు అభ్యర్థిగా సివ్వేరి దొన్ను దొరను చంద్రబాబు ప్రకటించారు. మరికొన్ని చోట్ల కూడా అభ్యర్థుల ప్రకటనకు ఆయన సిద్ధమయ్యారు.ఈ నేపథ్యంలో పవన్ కూడా అభ్యర్థులను ప్రకటించినట్లు తెలుస్తోంది.