Amaravathi, Mar 06: ఏపీలో మళ్లీ ఎన్నికల సందడి మొదలైంది. స్థానిక ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ (AP Local Body Election Schedule) (MPTC, ZPTC Electons) విడుదలైంది. మొత్తం రెండు దశల్లో ఎన్నికలను నిర్వహించనున్నారు. ఈ నెల 21, 24 తేదీల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించనున్నారు. మార్చి 27న మున్సిపల్ ఎన్నికలు (Municipal Elections) జరగనున్నాయి.
ఏపీ నుంచి ఆ నలుగురు?, విడుదలైన రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్
'నామినేషన్ల స్వీకరణ 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు చేయనున్నారు. 12వ తేదీన స్క్రూటినీ నిర్వహించి, అభ్యంతరాలు ఉంటే 13వ తేదీన తెలియజేయాలని 14వ తేదీన అభ్యంతరాలను పరిశీలిస్తారని , అలాగే నామినేషన్లు ఉపసంహరించుకోవటానికి 14వ తేదీ చివరి తేదీ అని ప్రకటించారు. ఇక ఈ రెండు విడతల్లో జరిగిన ఎన్నికలకుగాను కౌంటింగ్ మార్చి 29న చేయనున్నట్లు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది.
రాష్ట్రంలో 13 జిల్లా పరిషత్‌లు ఉండగా... 660 మండల పరిషత్‌లు ఉన్నాయి. ఇంతకు ముందే జిల్లా పరిషత్‌లకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై అనర్హత వేటు వేసేలా జగన్ సర్కారు కొత్త ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. దీని ప్రకారం స్థానిక ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించనున్నారు.
15 రోజుల్లోగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముగించేలా ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. కాగా ఈ ఎన్నికల తర్వాతే జగన్ సర్కారు బడ్జెట్ సమావేశాలను నిర్వహించనుంది. కాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల విషయమై టీడీపీ సుప్రీం కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే.
జిల్లా పరిషత్ ఎన్నికలకు జిల్లాల వారీగా రిజర్వేషన్ల వివరాలు:
శ్రీకాకుళం జిల్లా - బీసీ మహిళ
విజయనగరం జిల్లా - జనరల్
విశాఖపట్నం జిల్లా - ఎస్టీ మహిళ
తూర్పుగోదావరి జిల్లా - ఎస్సీ
పశ్చిమగోదావరి జిల్లా - బీసీ
కృష్ణా జిల్లా - జనరల్ మహిళ
గుంటూరు జిల్లా - ఎస్సీ మహిళ
ప్రకాశం జిల్లా - జనరల్ మహిళ
నెల్లూరు జిల్లా - జనరల్ మహిళ
కర్నూలు జిల్లా - జనరల్
కడప జిల్లా - జనరల్
అనంతపురం జిల్లా - బీసీ మహిళ
చిత్తూరు జిల్లా - జనరల్
ఇటు ఎంపీపీ, ఎంపీటీసీ, జెడ్పీపీపీ, జెడ్పీటీసీ రిజర్వేష్లను కూడా ఖరారు చేశారు. హైకోర్టు ఇటీవలే రిజర్వేషన్లపై కీలక సూచనలు చేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి రిజర్వేషన్లు 50శాతానికి మించకూడాదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం గతంలో విడుదల చేసిన రిజర్వేషన్లను పక్కన పెట్టి తాజాగా మళ్లీ ఖరారు చేసింది.