Visakhapatnam, Oct 25: ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రాంతీయ కార్యకలాపాలు (Metro Rail Operations) విశాఖ నుంచి ప్రారంభం అయ్యాయి. విశాఖ నగరంలోని ఎల్‌ఐసీ భవన్ మూడో అంతస్తులో రీజనల్ కార్యాలయాన్ని మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్ ఆదివారం ఆరంభించారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యే అదీప్ రాజ్, జీవీఎంసీ కమిషనర్ సృజన పాల్గొన్నారు. అధికారులు.. మెట్రో రైల్ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్‌ను (Amaravati Metro Rail Corporation Limited (AMRCL) మంత్రులకు వివరించారు.
కాగా విశాఖపట్నంలో 79,91 కిలోమీటర్ల మేర లైట్ మెట్రో కారిడార్, 60.29 కిలోమీటర్ల మేర మోడ్రన్ ట్రామ్ కారిడార్ నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇక్కడ నుంచే ఈ ప్రాజెక్ట్‌ను అధికారులు పరిశీలించేందుకు (Metro Rail Corporation Regional Activities) సన్నద్ధం అవుతున్నారు. వచ్చే రెండు నెలల్లో మెట్రో ప్రాజెక్టుల డీపీఆర్‌లు సిద్ధం కానున్నాయి. డీపీఆర్‌లపై కన్సల్టెంట్లతో చర్చలు, ఇతర అంశాలపై చర్చించాలనే ఉద్ధేవంతో విశాఖలో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేసినట్లు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి తెలిపారు.
కార్యాలయ ప్రారంభం సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. మొదట గాజువాక నుంచి కొమ్మాది వరకూ మెట్రో అనుకున్నాం. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రానున్న అవసరాల దృష్ట్యా మెట్రో దూరాన్ని పెంచమని చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మెట్రో రైలు స్టీల్ ప్లాంట్ నుంచి భోగాపురం విమానాశ్రయం వరకూ దూరం పెంచి డీపీఆర్ తయారు చేస్తున్నాం. యూఎంటీసీ (Umtc) సంస్థకు మెట్రో డీపీఆర్ తయారు చేయమని చెప్పామని తెలిపారు.
నవంబర్ మొదటి వారంలో డీపీఆర్ ఇస్తామని చెప్పారు. దసరా కావడంతో మెట్రో రైల్ కార్యాలయం ప్రారంభించాం. డీపీఆర్ తయారు చేశాక ముఖ్యమంత్రి ఆమోదంతో టెండర్లు పిలుస్తాం. విశాఖ మెట్రోకు కేంద్ర సహాయ సహకారాలు అవసరం. విశాఖను దేశంలో గొప్ప నగరంగా అభివృద్ధి చేయాలని చూస్తునామని అన్నారు.
మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంచి ఆలోచన, విజన్‌తో విశాఖకు మెట్రో కేటాయించారు. విశాఖకు మెట్రో రైల్ వస్తే ఉత్తరాంధ్ర రూపు రేఖలు మారిపోతాయి. గత ప్రభుత్వం ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేసింది. ప్రతిపక్ష పార్టీలు ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నాయి అని మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు.
మెట్రో రైల్‌ఎండీ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. లైట్ మెట్రోతో అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ట్రాఫిక్ పెరిగే కొద్దే కోచ్‌లు పెంచుకోవచ్చని, లైట్ మెట్రోకు కిలోమీటర్‌కు 200 కోట్ల రూపాయిలు ఖర్చు అవుతుందని తెలిపారు.