Nandyal, Nov 9: నంద్యాలలో సామూహిక ఆత్మహత్యకు పాల్పడిన అబ్దుల్ సలామ్ కుటుంబ సభ్యులను (Nandyal Family Suicide Case) సోమవారం డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పరామర్శించారు. అబ్దుల్ సలామ్ కుటుంబ సభ్యులకు, వారి బంధువులకు అండగా ఉంటామని డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా ( AP Deputy CM Amjad Basha) హామీ ఇచ్చారు. అన్యాయంగా, అక్రమంగా ప్రజలపై ఎవరు అత్యుత్సాహం ప్రదర్శించిన చట్టపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అబ్దుల్ సలామ్ (Abdul Salam) ఘటనపైన ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ప్రత్యేక అధికారుల ద్వారా సమగ్ర దర్యాప్తు చేపడుతుంది. వీరిని ఆత్మహత్యకు ప్రేరేపించిన ఏ ఒక్కరినీ వదలకుండా దర్యాప్తు జరుగుతుందని డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా వెల్లడించారు. కాగా గతంలోనే సామూహిక ఆత్మహత్యలపై సీఎం వైఎస్ జగన్ స్పందిస్తూ విచారణకు ఆదేశించారు. ఈ కేసుకు సంబంధించి ఆత్మహత్యకు ప్రేరేపించారని ఆరోపణలున్న సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ గంగాధర్‌లను ఇప్పటికే సస్పెండ్ చేస్తూ వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
ఈ కేసుకు సంబంధించి నంద్యాల సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే సీఐ సోమశేఖర్ రెడ్డిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఐజీపీ శంఖబ్రత బాగ్చి, ఐపీఎస్ అధికారి అరిఫ్ ఆఫీజ్ నంద్యాలకు చేరుకుని విచారణ ప్రారంభించారు. తప్పు చేస్తే ఎంతటి వారైనా వదిలి పెట్టే ప్రసక్తి లేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు.
కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి చెందిన షేక్ అబ్దుల్ సలాం అనే ఆటో డ్రైవర్ కుంటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. షేక్ అబ్దుల్ సలాం (45), అతని భార్య నూర్జహన్ (38)తో పాటుగా 14 ఏళ్ల కూతురు సల్మా, 12 ఏళ్ల కుమారుడు దాదా కలందర్ కర్నూలు జిల్లా పాణ్యం మండలం కౌలూరు రైల్వే స్టేషన్ వద్ద ఆత్మహత్య చేసుకున్నారు. వారంతా గూడ్స్ రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నారు. ఆర్థిక సమస్యలతో వారు ఆత్మహత్య చేసుకున్నారని భావించారు.
అయితే, పోలీసుల వేధింపులే కారణమనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఇలాంటి సమయంలో కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి ముందు అబ్దుల్ సలాం తీసిన సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది. పోలీసుల వేధింపుల వల్లే తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని సలాం అందులో తెలిపాడు.