Hyd, Jan 11: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ( MP Raghuramakrishna Raju ) ఏపీ హైకోర్టు ( AP High Court ) లో తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. ఈ సంక్రాంతికి మా ఊరు వెళ్తానని నాకు రక్షణ కల్పించాలని కోరుతూ ఈ పిటిషన్ దాఖలు చేశారు.ఏపీ పోలీసులు రఘురామపై 11 కేసులు పెట్టారని, మరో కేసు పెట్టే అవకాశం ఉందని ఆయన తరఫు న్యాయవాదులు ఉమేష్ చంద్ర, వై.వి. రవిప్రసాద్ ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు. గతంలో సీఐడీ అధికారులు రఘురామరాజును అరెస్టు చేసి చిత్ర హింసలకు గురి చేశారని హైకోర్టుకు ఉమేష్ చంద్ర గుర్తు చేశారు.
మరోసారి తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసే అవకాశముందని పోలీసులు నిబంధనలు పాటించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. ఆర్నేష్ కుమార్ కేసులో 41ఏ నిబంధనలు పాటించాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఎంపీ న్యాయవాది ఈ సందర్భంగా ప్రస్తావించారు.దీనిని విచారించిన ధర్మాసనం పోలీసులు రఘురామకృష్ణరాజుపై నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
అయితే రఘురామకృష్ణరాజు పిటీషన్‌కు విచారణ అర్హత లేదని ప్రభుత్వ న్యాయవాది కోర్టులో వాదించారు. రఘురామపై కేసు నమోదై, అది ఏడేళ్ల లోపు శిక్ష ఉన్న సెక్షన్లు అయితేనే 41 ఏ నిబంధనలు వర్తిసాయని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టులో పేర్కొన్నారు. రఘురామకృష్ణరాజుపై ఏపీ ప్రభుత్వం తాజాగా ఎలాంటి కేసులు పెట్టలేదని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం ఉత్తర్వులను రేపు ఇస్తామని హైకోర్టు వెల్లడించింది.