Amarawathi, AUG 14: ఉత్తర బంగాళాఖాతంలో (Bay of Bengal) మరో అల్పపీడనం ఏర్పడటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24 గంటల్లో అల్పపీడనంగా (low-pressure) మారి తుపానుగా (Cyclne) మారే అవకాశం ఉన్నది. అల్పపీడనం సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తులో ఉపరితల ద్రోణితో ముడిపడి ఉండి.. ఉపఖండం మీదుగా పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ (IMD) పేర్కొన్నది. అల్పపీడన ద్రోణి, ఉపరితల ద్రోణి నేపథ్యంలో ఉత్తర కోస్తాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విశాఖపట్నంలో ఆదివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో (Rayalaseema) తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది. మరోవైపు, ఆంధ్రప్రదేశ్ (Andhra Padesh) అంతటా పశ్చిమ గాలులు వీస్తున్నాయి. దీని కారణంగా ఆదివారం ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లో గంటకు 45 నుంచి 65 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మరో రెండు, మూడు రోజులపాటు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.
బంగాళాఖాతంలో శనివారం ఉదయం 8.30 గంటలకు ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో (low-pressure area) రానున్న మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD)తెలిపింది. అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ రానున్న 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నది. ఆంధ్రప్రదేశ్, యానాంలో ట్రోపోస్పియర్ దిగువన పశ్చిమం వైపు నుంచి బలమైన గాలులు వీస్తున్నాయి.
ఉత్తర కోస్తా, యానాంలో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. కోస్తాంధ్రలో రేపు ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. అదేవిధంగా, సోమవారం రాష్ట్రంలోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. దక్షిణ కోస్తా ఆంధ్రలో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం, రాయలసీమలో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని ఐఎండీ పేర్కొన్నది.