Representational Image (Photo Credits: Twitter)

Kurnool, June 6: కర్నూలు జిల్లాలో కుమారుడు కులాంతర వివాహం చేసుకున్నాడని 15 సంవత్సరాల నుంచి ఓ తండ్రి బాంధవ్యాలను తెంపుకున్నాడు. చివరకు కుమారుడి మృతదేహాన్ని కూడా చూడడానికి ఆ తల్లిదండ్రులు నిరాకరించి ఇంటికి తాళం వేసి వెళ్లారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సుండిపెంటలో వ్యాపారం చేసుకుంటున్న మాలపాటి బసిరెడ్డికి నలుగురు సంతానం. రెండో కుమారుడైన రామకృష్ణారెడ్డి 15 ఏళ్ల క్రితం దళిత కులానికి చెందిన బెజవాడ వీరమ్మను ప్రేమ వివాహం (inter-caste marriage) చేసుకున్నాడు. అయితే అది సహించలేని తండ్రి బసిరెడ్డి కుమారునితో తెగదెంపులు చేసుకున్నాడు. అప్పటి నుంచి రామ కృష్ణారెడ్డి ప్రైవేట్‌ జీప్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

కాగా గత శుక్రవారం రాత్రి ప్రకాశం జిల్లా పుచ్చకాయల పల్లికి సమీపంలో జీపులో వెళ్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. జీపు డ్రైవర్ రామ కృష్ణారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతన్ని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా కోలుకోలేక శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందాడు. ఇది తెలిసిన అతని తల్లిదండ్రులు కుమారుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకువస్తారని భావించి శనివారం ఉదయం నుంచే ఇంటికి తాళాలు వేసి (Parents locked the house) ఎటో వెళ్లిపోయారు.

యువతిని వేధించావంటూ బంధువులు దాడి, అవమానం భరించలేక కుటుంబం మొత్తం ఆత్మహత్య, నేను ఏ తప్పు చేయలేదంటూ సూసైడ్‌ నోట్‌, కీసరలో కలకలం రేపిన ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు

కృష్ణారెడ్డి మృతదేహాన్ని భార్య వీరమ్మ, కుమార్తెలు మానస, కవిత.. తన తాత మాలపాటి బసిరెడ్డి ఇంటికి తీసుకురాగా తాళాలు వేసి ఉండడంతో ఇంటి ముందే కొద్ది సేపు మృతదేహాన్ని ఉంచారు. వారు ఎంతకీ రాకపోవడంతో ఆ తరువాత అంత్యక్రియలకు తరలించారు. ప్రైవేట్‌ జీప్‌ ఓనర్లు, డ్రైవర్ల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. కృష్ణారెడ్డి కుటుంబానికి వారు రూ.15 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు.