Keesara, June 5: తెలంగాణ రాష్ట్రంలో మేడ్చల్ పరిధిలోని నాగారం మునిసిపాలిటీ కేంద్రం కీసరలో విషాద ఘటన చోటుచేసుకుంది. అవమానం భరించలేనంటూ జీవితంపై విరక్తి చెందిన ఓ ఆటో డ్రైవర్ భార్యా పిల్లలకు విషమిచ్చి ఆ తర్వాత అతను ఉరివేసుకుని ఆత్మహత్య (Four of family found dead) చేసుకున్నాడు. దీనికి కారణం ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని చుట్టు పక్కల వారి దాడి చేయడమే..
కుషాయిగూడ అడిషనల్ డీసీపీ శివకుమార్, కీసర సీఐ నరేందర్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి జిల్లా రాజపేట మండలం రేణిగుంటకు చెందిన భిక్షపతి (37), ఉష (33) దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు అక్షిత (11) యశ్వంత్ (7). కొన్నేళ్లుగా నాగారంలోని వెస్ట్‌గాంధీనగర్‌లో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. భిక్షపతి ఆటోనడుపుతూ కాలం వెళ్లదీస్తున్నాడు.కాగా ఇంటి సమీపంలోని ఫిల్టర్ వాటర్ కంపెనీలో పనిచేస్తున్న ఓ మహిళ తన 15 ఏళ్ల కూతురుతో ఉంటోంది. ఆ బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ ఆ బాలిక బంధువులు గురువారం సాయంత్రం భిక్షపతి ఇంటికొచ్చి గొడవకు దిగారు. అతనిపై దాడి చేశారు.
ఇదే విషయమై శుక్రవారం పెద్దల సమక్షంలో మాట్లాడదామని చెప్పి భిక్షపతిని వదిలేశారు. శుక్రవారం ఉదయం భిక్షపతి ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఆటో తీసుకొని వెళ్తుండగా బాలిక కుటుంబసభ్యులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన భిక్షపతి ఇంట్లోకెళ్లాడు. మొదట భార్య, ఇద్దరు పిల్లలకు ఉరివేసి తర్వాత తానూ ఉరివేసుకొని ఆత్మహత్యకు (hangs self)పాల్పడ్డాడు. ఉరివేసుకునే ముందు సూసైడ్ నోట్ రాశాడు. తాను బాలికతో ఎంతమాత్రం అసభ్యంగా ప్రవర్తించలేదని, కొంతమంది కావాలని తనపై నింద వేసినట్లు గురువారం రాత్రి స్థానికులు, బంధువులకు భిక్షపతి చెప్పినట్లు సమాచారం.
ఇరుగుపొరుగు వారి సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని భిక్షపతి ఇంట్లోకెళ్లి పరిశీలించగా భార్య, ఇద్దరు పిల్లలు విగత జీవులుగా మంచంపై పడి ఉన్నారు. భిక్షపతి ఫ్యాన్‌కు ఉరేసుకొని మృతిచెందినట్లు పోలీసులు గుర్తించారు. క్లూస్‌టీమ్‌ను రప్పించి ఆధారాలను సేకరించారు. అక్కడ దొరికిన సైసైడ్ నోట్ ప్రకారం.. తమ చావులకు కారణమంటూ కొంతమంది పేర్లను భిక్షపతి రాసినట్లు గుర్తించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ.. తనను అవమానించారని, అంతేకాకుండా రూ.5 లక్షలు ఇవ్వాని డిమాండ్ చేస్తున్నారని భిక్షపతి సూసైడ్ నోట్‌లో వెల్లడించారు. అవమానం భరించలేకనే తన భార్య, పిల్లలతో పాటు తానుకూడా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నోట్‌లో పేర్కొన్నాడు.
తర్వాత భిక్షపతి కుటుంబీకుల మృతదేహాలను తీసుకెళ్లనీయకుండా స్థానికులు, బంధువులు పోలీసులను అడ్డుకున్నారు. కారకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని, సూసైడ్‌నోట్‌లో పేర్కొన్న వ్యక్తులను అదుపులోకి తీసుకుంటామని సీఐ హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. అనంతరం నాలుగు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గురువారం రాత్రి భిక్షపతిపై దాడి జరిగిన సమయంలో ఆయన భార్య ఉష డయల్ 100కు ఫోన్ చేసి తన భర్తను కొడుతున్నారని చెప్పింది. దీంతో పోలీసులు అక్కడికి వచ్చారు. అప్పుడు గొడవకు దిగిన వారిలో కొందరు కులపెద్దల సమక్షంలో మాట్లాడి పరిష్కరించుకుంటామని చెప్పడంతో పోలీసులు తిరిగి వెళ్లిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తాం. తనపై దాడి వల్లనే మనస్తాపానికి గురై భిక్షపతి ఇలా ఘాతుకానికి పాల్పడ్డాడా లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తాం. నిందితులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కుషాయిగూడ అదనపు డీసీపీ శివకుమార్ చెప్పారు.