ఏపీలో వచ్చే ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని వారాహి యాత్ర చేస్తున్న పవన్ కళ్యాణ్ ఈ రోజు కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన నేతలతో భేటీ అయ్యారు. ఇందులో ఇతర పార్టీలకూ, తమ పార్టీకి ఉన్న వ్యత్యాసం, వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై సుదీర్ఘంగా చర్చించారు. జనసేన నేతలు బలంగా మారాలని, తద్వారా పార్టీని బలోపేతం చేయాలని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. ఇంట్లో కూర్చుని గెలిచేయాలి.. అధికారం వచ్చేయాలంటే కుదరదన్నారు. అన్ని చోట్లకు పవన్ కళ్యాణ్ రావాలంటే ఎలా? అని ప్రశ్నించారు.
జనసేన ప్రభుత్వాన్ని స్థాపించే దిశగా అడుగులు వేద్దామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. నియోజకవర్గ రాజకీయ సమీకరణాలు, సమస్యలపైనా పవన్ వారితో చర్చించారు. కులాలు , వర్గాలను దాటి రాజకీయం చేయాలని పవన్ నేతలకు సూచించారు. ఒక కులానికి ఒక పార్టీ అన్న పద్దతి ఉండకూడదన్నారు. మన ఆలోచనలు ఉన్నతంగా ఉండాలని నేతలకు పవన్ సూచించారు.
ఇక వారాహి విజయ యాత్రలో భాగంగా కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ గురువారం సాయంత్రం చేబ్రోలులో రైతులు, చేనేత కళాకారులు, పట్టు రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో చేనేత కార్మికులు, పట్టు రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు.ప్రభుత్వాన్ని స్థాపించే స్థాయిలో జనసేనను గెలిపించాలని.. తనను ఒక్కసారి ముఖ్యమంత్రిని చేసి చూడండని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా విలువలతో కూడిన రాజకీయాలు చేస్తామన్నారు.
జనసేన అధికారంలోకి వస్తేనే చేనేతల సమస్యలు పరిష్కారం అవుతాయని పవన్ కళ్యాణ్ అన్నారు. తాము అధికారంలోకి వస్తే చేబ్రోలును సిల్క్ సిటీగా మారుస్తామని ప్రకటించారు. జీఎస్టీని తొలగించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ఒకవేళ జీఎస్టీని కేంద్రం తొలగించకపోతే రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేలా చేస్తామన్నారు. ఉప్పాడ నేతలకి గిట్టుబాటు కూడా రాకపోవడం తనని కలిచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. చీరాలలో తాను చేనేత కుటుంబాల మధ్య పెరిగానని.. దశాబ్దాలుగా పట్టు రైతులు ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నారని చెప్పారు.
కుప్పంలో లక్ష ఓట్ల మెజారిటీ, వైసీపీ వై నాట్ 175కి పోటీగా సరికొత్త నినాదంతో ముందుకు వచ్చిన చంద్రబాబు
తాను వైసీపీ దౌర్భాగ్యులతో సరదాగా మాటలు అనిపించుకోవడం లేదని, ఒక ఆవేదనతో పని చేస్తున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాదిరిగా తాను తన కులానికి చెందిన వారికే 85 శాతం పదవులు ఇవ్వబోనని అన్నారు. సీఎం లాగా నోటికి ఏది వస్తే అది మాట్లాడననని.. చేసేదే చెప్తానని పేర్కొన్నారు. తన కులం కోసం తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. ప్రజలు మోసగాళ్ల మాటలు నమ్మొద్దని సూచించారు. ఆ ప్రభుత్వానికి నిజాయితీపరులంటే చాలా భయమని చురకలంటించారు. పదేళ్ల నుంచి అధికారం లేకపోయినా.. రోడ్ల మీద తిరిగి, ప్రజా సమస్యల్ని తాము పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు.
ప్రభుత్వాన్ని స్థాపించే స్థాయిలో జనసేనను గెలిపిస్తే.. దేశం మొత్తం చూసేలా పిఠాపురంను తయారు చేస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. పదేళ్ల పాటు జనసేన పార్టీకి అధికారాన్ని కట్టబెడితే.. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని చెప్పారు. కుల రాజకీయాలకు తాము స్వస్తి చెప్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతే రెండేళ్ల తర్వాత రాజీనామా చేస్తామని పవన్ ప్రకటించారు. ప్రలోభాలు దాటి జనసేన పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఇక, దళితులు తన మేనమామలు అన్న సీఎం జగన్మోహన్ రెడ్డి.. అంబేద్కర్ విదేశీ విద్య తీసేశారన్నారు. జనసేన పార్టీ ప్రజా ప్రతినిధులను అసెంబ్లీకి పంపించాలని, వచ్చే ఎన్నికల్లో మోసగాళ్ళ మాటలు నమ్మొద్దన్నారు. అమ్మ ఒడి ఇచ్చి, నాన్న జేబు ద్వారా డబ్బులు లాగేసుకుంటున్నారని నిప్పులు చెరిగారు.