Representational Purpose Only (Photo Credits: File Image)

Vijayawada, OCT 16: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో (Andhra Pradesh) ఇవాల్టి నుంచి ప్రైవేటు మద్యం దుకాణాలు (Private liquor shops) ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 3,396 దుకాణాలకు లైసెన్సుల జారీ ప్రక్రియ పూర్తి కావడంతో వాటిని దక్కించుకున్న వారు.. నేటి నుంచే వ్యాపారం మొదలు పెట్టనున్నారు. వారంతా తొలి విడత లైసెన్సు రుసుముల కింద ప్రభుత్వానికి రూ.330 కోట్లు చెల్లించారు. ప్రతి దుకాణం నుంచి వారం రోజులకు సరిపడా మద్యం నిల్వల కోసం లైసెన్సుదారులు ఏపీఎస్‌బీసీఎల్‌కు (APSBPCL) ఆర్డర్లు పెట్టారు. వాటి విలువ దాదాపు రూ.350 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకూ ఉంది. ఈ ఆర్డర్ల కోసం ఎక్సైజ్‌ శాఖ లైసెన్సీలకు ప్రత్యేకంగా లాగిన్‌ ఐడీలు ఇచ్చింది. వైఎస్సార్ సీపీ హయాంలో గత ఐదేళ్లుగా కొనసాగిన ప్రభుత్వ మద్యం దుకాణాలకు మంగళవారంతో కాలం చెల్లింది. రాత్రి 10 గంటలకు వాటన్నింటినీ మూసివేసిన ఎక్సైజ్‌ అధికారులు, ఆయా దుకాణాల్లోని మిగిలిన స్టాకు, ఇతర వస్తువుల వివరాలన్నింటితో ఇన్వెంటరీ సిద్ధం చేశారు. బుధవారం ఆ స్టాక్‌ను డిపోలకు, వస్తువులను స్థానిక ఎక్సైజ్‌ స్టేషన్‌లకు తరలించనున్నారు.

New Liquor Policy in AP: ఏపీలో ముగిసిన మద్యం లాటరీ ప్రక్రియ, లిక్కర్ షాపులను దక్కించుకున్న మహిళలు, అక్టోబర్ 16 నుంచి కొత్త షాప్‌లో మద్యం అమ్మకాలు 

మద్యం వ్యాపారం ప్రైవేటు చేతుల్లోకి వెళ్లినందున వినియోగదారులు కోరుకునే బ్రాండ్లన్నీ అందుబాటులోకి తీసుకురానున్నారు. లైసెన్సుదారులు ఆర్డర్లు పెట్టిన రకాలనే సరఫరా చేసేందుకు ఏపీఎస్‌బీసీఎల్‌ సిద్ధమవుతోంది. ప్రధానంగా దేశవ్యాప్తంగా లభించే అన్ని బ్రాండ్లను వారం రోజుల్లో అందుబాటులో ఉంచనుంది. రూ.99కే క్వార్టర్‌ మద్యం విక్రయిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో, నాలుగు నేషనల్‌ కంపెనీలు ఆ ధరలో అందించేందుకు సిద్ధమయ్యాయి. అవి రెండు మూడు రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి.

New Liquor Policy in AP: బాబోయ్.. విశాఖలో 155 మద్యం షాపులకు అప్లికేషన్లు వేసిన ఢిల్లీ వ్యాపారి, దరఖాస్తు రుసుమే రూ.3 కోట్లు, ఇంతకీ ఆయనకు దక్కిన షాపులు ఎన్నంటే.. 

అటు చంద్ర‌బాబు స‌ర్కార్ మద్యంపై కొత్తగా డ్రగ్‌ కంట్రోల్‌ సెస్‌ విధించింది. ‘ల్యాండెడ్‌ కాస్ట్‌’పై 2 శాతం మేర ఈ పన్ను వేయనుంది. దీనిద్వారా ఏడాదికి రూ.90 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు సమకూరుతుందని అంచనా. గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపడం, వ్యసన విముక్తి, కౌన్సెలింగ్‌ కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ తదితరాలకు ఈ సొమ్ము వెచ్చించనుంది. మరికొంత మొత్తాన్ని రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేయబోయే యాంటీ నార్కొటిక్స్‌ టాస్క్‌ఫోర్స్‌కు ఇవ్వనుంది.