Railway-passengers-finding-new-ways-to-escape-platform-tickets

Vijayawada, October 4: దసరాకు ముందు ఏపీలో ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫామ్ టికెట్ రేట్లు పెరిగిన సంగతి అందరికీ తెలిసిందే. దసరా రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ రైల్వే ప్లాట్‌ఫామ్ టికెట్ ధరను రూ.10 నుంచి రూ.30కు పెంచింది. కాగా పెరిగిన ధరలు దసరా పండుగ సందర్భంగా పదిరోజులపాటు అమలులో ఉంటాయని ప్రకటించింది. రైల్వే ప్లాట్‌ఫామ్ టికెట్ల ధరను భారీగా పెంచడంతో ప్రయాణీకులు ఈ భారం నుంచి తప్పించుకోవడానికి కొత్త స్కెచ్ వేశారు. టికెట్ బాదుడు నుంచి తప్పించుకోవడానికి ప్రయాణికులు కొత్త రూట్‌లో వెళుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రైల్వే శాఖ ఒక్కసారిగా అవాక్కయిందనే చెప్పాలి.

30 రూపాయల ప్లాట్ ఫాం ధర కంటే తక్కువ దూరం జర్నీకి టికెట్ కొనుగోలు చేస్తున్నారు. దీంతో షార్ట్ జర్నీ టికెట్ల విపరీతంగా అమ్ముడుపోతున్నాయి. ప్లాట్ ఫాం టికెట్ కౌంటర్లు ఖాళీగా ఉంటున్నాయి. ఈ క్రమంలో విజయవాడ రైల్వే స్టేషన్‌లో ఫ్లాట్‌ఫామ్‌ టికెట్ల కన్నా.. గుంటూరు ప్యాసింజర్‌ రైలు టికెట్లు పెద్దమొత్తంలో అమ్ముడుపోతున్నాయి.  2 గంటలు రైల్వే స్టేషన్‌లో ఉంటే 30 రూపాయలు

దీనికి కారణం తక్కువ దూరానికి 10 రూపాయలే ఉంటుంది. 30 పెట్టి ప్లాట్ ఫాం టికెట్ కొనే కంటే.. 10 రూపాయలతో రైలు టికెట్ కొంటే సరిపోతుందని అనుకోడమే. గుంటూరు, విజయవాడ రైల్వే స్టేషన్లలో చాలామంది ఇలానే చేస్తున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్‌లో తమ బంధువులకు స్వాగతం పలికేందుకు, లేదా వీడ్కోలు పలికేందుకు వస్తున్న వారు.. ఫ్లాట్ ఫామ్ టికెట్‌కు బదులు పది రూపాయలు పెట్టి.. గుంటూరు పాసింజర్ టికెట్లు కొంటున్నారు. ఇలా వారికి రూ. 20 ఆదా కావడమే కాకుండా రైల్వే స్టేషన్‌లోకి వెళ్లేందుకు అనుమతి లభిస్తోంది.

ఈ విషయాన్ని గుర్తించిన రైల్వే అధికారులు తాజాగా ప్రయాణికులను ఉద్దేశించి ఓ ప్రకటన చేశారు. ప్లాట్‌ఫామ్‌ టికెట్ ధర పెంచడం వల్ల రైల్వే శాఖకు వచ్చే ఆదాయం అతి స్వల్పమని, ప్రయాణికుల భద్రత కోసమే పెంచామని రైల్వే అధికారులు చెబుతున్నారు. దయచేసి ఫ్లాట్‌ఫామ్‌ టికెట్లు మాత్రమే కొనండి, తక్కువ ధర అని ప్యాసింజరు రైలు టికెట్లు కొనకండని విజ్ఞప్తి చేశారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్యాసింజర్ టికెట్ తీసుకున్న ప్రయాణికులు తమ పని అయిపోగానే ఆ టికెట్ ను స్టేషన్‌కు వచ్చే వేరేవారికి ఇచ్చేస్తున్నారు. ఆ టికెట్ 24 గంటల పాటూ చెల్లుబాటు కావడంతో వారు ఈ పనిచేస్తున్నారు. దీంతో రైల్వే శాఖ అదనపు బాదుడు నుంచి వారు ఉపశమనం పొందుతున్నారు.