VJY, Dec 3: పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా రాయలసీమలోని కర్నూలులో ఈ నెల 5వ తేదీన రాయలసీమ గర్జన (rayalaseema garjana) జరగనుంది. రాయలసీమ గర్జనకు లక్షలాదిగా తరలిరావాలని రాయలసీమ ఐక్య కార్యాచరణ అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి (vijay kumar reddy President of Rayalaseema United Action) పిలుపునిచ్చారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలో రాజధాని ఏర్పాటు కావాల్సిందేనని తేల్చిచెప్పారు. అన్యాయం జరిగిన రాయలసీమ కన్నీళ్లను న్యాయ రాజధానితో తుడవాలన్నారు.
హైకోర్టుతో ఏమొస్తుందనే అపోహలు అర్ధరహితం. న్యాయ రాజధానితో, 9 జాతీయ రహదారులతో అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ పెరుగుతుందని తెలిపారు. 10, 500 ఎకరాల్లో దేశంలోనే ఎనిమిదో అతిపెద్ద ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చి, నిరుద్యోగిత సమసిపోతుందని అన్నారు. సీమకు రాజధాని రావాలంటే ప్రతి ఒక్కరి మద్దతు అవసరం. మనందరి భవిష్యత్తు కోసం జరిగే ఉద్యమానికి లక్షలాదిగా రావాలని కోరుతున్నామని విజయ్ కుమార్ తెలిపారు.
రాయలసీమ గర్జన సభకు వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు ఇస్తుందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు. రాయలసీమ హక్కుల కోసం జేఏసీ పోరాటం చేస్తోందని, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని జేఏసీ డిమాండ్ చేస్తోందన్నారు. డిసెంబర్ 5వ తేదీన కర్నూలులో జేఏసీ సమావేశం నిర్వహిస్తున్నారని, రాయలసీమ గర్జన పేరుతో ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
రాయలసీమ గర్జన సభకు తమ పార్టీ వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు బుగ్గన పేర్కొన్నారు. చంద్రబాబు అన్ని ప్రాంతాల వారిని మోసం చేశారని, పచ్చటి పొలాలను కూడా నాశనం చేశారని బుగ్గన మండిపడ్డారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి సీఎం జగన్ కృషి చేస్తున్నారనే విషయాన్ని మరోసారి గుర్తుచేశారు మంత్రి.