Sanitation Workers Strike: కార్మికులు సమ్మె విరమించి విధుల్లోకి వస్తేనే చర్చలు, డిమాండ్లలో ఆరోగ్య భత్యం మినహా అన్ని సమస్యల పరిష్కారంపై చర్చిస్తామని తెలిపిన మంత్రి ఆదిమూలపు సురేష్
AP Educational minister Adimulapu Suresh (Photo-Twitter)

Vizag, July 13: ఏపీలో గత మూడు రోజుల నుంచి పట్టణ పారిశుధ్య కార్మికులు సమ్మె (Sanitation Workers Strike) పలు డిమాండ్లతో సమ్మె చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. పట్టణ పారిశుధ్య కార్మికులు సమ్మెను విరమించి, విధుల్లోకి వస్తేనే వారి సమస్యల పరిష్కారంపై చర్చిస్తామని పురపాలక శాఖ మంత్రి (Minister Adimulapu Suresh) తెలిపారు. ఈ మేరకు పారిశుధ్య కార్మిక ఐక్య కార్యాచరణ సమితికి (జేఏసీ) సమాచారం ఇచ్చినట్లు మంగళవారం ఆయన చెప్పారు.

మంత్రుల ముందుంచిన డిమాండ్లలో ఆరోగ్య భత్యం మినహా మిగిలిన అన్నింటినీ పరిష్కరిస్తామని సోమవారం మంత్రుల కమిటీతో జరిగిన చర్చల్లో కార్మిక జేఏసీకి చెప్పినప్పటికీ కార్మికులు సమ్మెకే మొగ్గు చూపారని, దీంతో పట్టణ పారిశుధ్య నిర్వహణ, ఇతర విధులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. కార్మికులు పూర్తిస్థాయిలో సమ్మెను విరమించి విధులకు హాజరైతేనే వారితో చర్చిస్తామని ఆయన ప్రకటించారు.

సచివాలయంలో సోమవారం రాత్రి జరిగిన మంత్రుల కమిటీతో జరిగిన చర్చల్లో మంత్రులు సురేష్, బొత్స సత్యనారాయణ మున్సిపల్‌ కార్మిక జేఏసీతో చర్చించారు. ఇందులో కార్మికులు వెల్లడించిన మొత్తం 23 డిమాండ్లలో ఓహెచ్‌ఏ మినహా మిగిలిన అన్ని డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయితే, ఓహెచ్‌ఏను గతంలో మాదిరిగా రూ.6 వేలు చెల్లించాల్సిందేనని జేఏసీ నేతలు పట్టుబట్టారు.

మరో నాలుగైదు రోజులు భారీ వర్షాలే, తీవ్ర అల్పపీడనంగా బలపడిన అల్పపీడనం, తెలంగాణలో 13 జిల్లాలకు రెడ్ అలర్ట్, ఏపీలో వర్షాలపై సీఎం జగన్ జగన్ వీడియో కాన్ఫరెన్స్

గత ప్రభుత్వంలో పట్టణ పారిశుధ్య విభాగంలోని ఒప్పంద కార్మికుల వేతనం రూ.12 వేలుగా ఉండేదని, వేతనాలు తక్కువగా ఉన్నందున వారికి అదనంగా ఓహెచ్‌ఏ రూపంలో రూ.6 వేలను ప్రభుత్వం ప్రత్యేకంగా ఇచ్చిందన్నారు. పీఆర్సీ పెరిగినందున వారి వేతనాలు రూ.15 వేలకు పెరగడంతో ఆ మేరకు ఆరోగ్య భత్యాన్ని సవరించి రూ.3 వేలు కలిపి రూ.18 వేలు చెల్లిస్తున్నట్లు మంత్రి సురేష్‌ వివరించారు. అయినప్పటికీ కార్మిక సంఘం నేతలు మిగిలిన రూ.3 వేలు కూడా కలిపి మొత్తం రూ.21 వేలు వేతనంగా ఇవ్వాలంటున్నారన్నారు. కానీ, కార్మికులు విధుల్లో చేరితేనే వారితో చర్చించాలని, అంతవరకు చర్చలు ఉండబోవని మంత్రి ఆదిమూలపు తేల్చిచెప్పారు.